చికిత్సపొందుతూ మహిళ మృతి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని డబ్బుతిమ్మాయపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి విజయ (57) చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న మండలంలోని నమిలికొండలో విజయ తల్లి మృతిచెందింది. దీంతో విజయ తన కొడుకు తిరుపతితో కలిసి బైక్‌పై నమిలికొండ వెళ్తుండగా, గ్రామంలోని జెడ్పీహెచ్ సూ్‌క్ల్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో కిందపడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందింది. మృతురాలి కూతురు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తగట్టుకు చెందిన మడ్డి శ్రీను, పెసరి రాజేశ్వరి కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయి. ఈనేపథ్యంలో దొంగలు రెండు ఇళ్లలో తాళాలు పగుల గొట్టి రూ.85వేల విలువ గల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. రాజేశ్వరి ఆదివారం వేకువజామున కొత్తగట్టులోని ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శేఖర్‌రెడ్డి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. అలాగే కొత్తగట్టుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటార్‌సైకిల్‌ను దొంగలు ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
యువకుడిని కాపాడిన లేక్ పోలీసులు
కరీంనగర్‌క్రైం: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ యువకుడు ఆదివారం మానేరు డ్యాం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా లేక్ పోలీసులు కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండలానికి చెందిన మధు కుటుంబ సమస్యల కారణంగా మానేరు డ్యాంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాడు. అతడిని గమనించిన లేక్ అవుట్ పోస్ట్ హోంగార్డు ఎం.నారాయణ అప్రమత్తమై అతడిని కాపాడాడు. అనంతరం పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా నారాయణను పోలీసులు, స్థానికులు అభినందించారు.
పశువుల పాక దగ్ధం
గంభీరావుపేట: మండలంలోని కోళ్లమద్ది గ్రామంలో పిట్ల బాలరాజు అనే రైతుకు చెందిన పశువుల పాక అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశువుల పాకతో పాటు గడ్డివాము, ద్విచక్రవాహనం కాలిపోయాయి. గుడిసెలో ఉన్న లేగదూడకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్క రైతులు, గ్రామస్తులు వచ్చి మంటలానార్పారు.


