క్రిప్టో.. నిండా ముంచారు | - | Sakshi
Sakshi News home page

క్రిప్టో.. నిండా ముంచారు

Jan 25 2026 7:00 AM | Updated on Jan 25 2026 7:00 AM

క్రిప్టో.. నిండా ముంచారు

క్రిప్టో.. నిండా ముంచారు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘క్రిప్టో’ కరెన్సీ పేరిట సామాన్యులను నిండా ముంచారు. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు చెందిన ప్రముఖులతోపాటు సామాన్యులు సైతం రూ.లక్షల్లో పెట్టి మోసపోయారు. అత్యాశకు పోయి దిక్కులు చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ముచ్చ రాజేందర్‌ ఈగల్‌ కాయిన్‌ అనే ఆన్‌లైన్‌ కంపెనీలో చైన్‌ సిస్టమ్‌ ద్వారా 18 నెలల్లో రూ.11 లక్షలు పెట్టారు. రూ.30 లక్షల వరకు వస్తాయని చెప్పగా.. రూ.1.20లక్షలు మాత్రమే రావడంతో అవాక్కయ్యాడు. తనను నమ్మించిన వారిని ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతుండడంతో సిరిసిల్ల పోలీసులను ఆశ్రయించాడు. రాజేందర్‌ ఫిర్యాదుతో స్థానిక బీ.వై.నగర్‌కు చెందిన పాసికంటి లవన్‌కుమార్‌(33), దోమల ప్రవీణ్‌(41), అశోక్‌నగర్‌కు చెందిన ఆడెపు శ్రీధర్‌(44), ప్రగతినగర్‌కు చెందిన వంగరి వేణుగోపాల్‌(40), నెహ్రూనగర్‌కు చెందిన మంచికట్ల సుధాకర్‌(42), సుభాష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగిందటే..

సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారికి అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. స్థానిక గోపాల్‌నగర్‌ ఎల్‌ఐసీ ఆఫీస్‌ పక్క భవనంలోని శ్రీక్రిప్టో కరెన్సీశ్రీ ఈగల్‌ కాయిన్‌ అనే సంస్థల్లో రూ.2.25 లక్షలు పెడితే.. రోజుకు రూ.900 నుంచి రూ.1000 చొప్పున వస్తాయని నమ్మించారు. అంతేకాకుండా థాయిలాండ్‌ ట్రిప్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆరు నెలల కిందట ఒకేసారి 90 మంది సిరిసిల్ల వాసులు థాయిలాండ్‌ టూర్‌ వెళ్లి రావడం విశేషం. ఇలా నమ్మించి సుమారు 200 మంది వద్ద రూ.4.50 కోట్లు వసూలు చేశారు. మొదట డిపాజిట్‌ చేసిన వారికి డబ్బులు బాగానే రాగా.. ఇప్పుడు డిపాజిట్ల సంఖ్య పెరిగి అసలుకే మోసం వచ్చింది.

అధిక వడ్డీ ఆశ

ఎలాంటి బోర్డు లేకుండానే ఆఫీస్‌ తెరిచి భారీగా డిపాజిట్లు సేకరించారు. ఒకరికి వడ్డీ డబ్బులు ఎక్కువ రావడంతో వాళ్లు మరొకరికి చెబుతూ డిపాజిట్లు చేయించారు. డిపాజిట్ల సేకరణ గోప్యంగా జరిగింది. కొందరు సామాన్యులు వడ్డీ ఆశకు పోయి భార్య మెడలో పుస్తెలతాడును కుదువపెట్టగా, మరికొందరు ఇల్లును తనఖా పెట్టి ప్రైవేటుగా అప్పులు తెచ్చి డిపాజిట్‌ చేశారు. ఇలా సిరిసిల్లలో అనేక మంది సామాన్యులు ఈగల్‌ కాయిన్‌ సంస్థలో డిపాజిట్‌ చేసి మోసపోయారు.

బీఫోర్‌ మోసం మరువకముందే..

సిరిసిల్ల నెహ్రూనగర్‌కు చెందిన యువకుడు వడ్డెపల్లి లక్ష్మీకాంత్‌(36) హైదరాబాద్‌ కేంద్రంగా హోటల్స్‌, రెస్టారెంట్ల బిజినెస్‌ చేశారు. హైదరాబాద్‌, గజ్వేల్‌, కొంపెల్లి, సుచిత్ర ప్రాంతాల్లో రెస్టారెంట్లు ప్రారంభించాడు. సిరిసిల్ల పాతబస్టాండు సమీపంలోనూ ఆరు నెలల కిందట బీఫోర్‌ బిల్లెట్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో పలువురి వద్ద రూ.లక్ష తీసుకుని నెలకు రూ.5వేల చొప్పున వడ్డీ ఇస్తూ.. నమ్మకంగా ఉన్నారు. ఈక్రమంలో చాలా మంది లక్ష్మీకాంత్‌ను నమ్మి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చారు. ఎప్పుడూ బిజీగా ఉండే లక్ష్మీకాంత్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో మోసం బయటపడింది. ఈ మోసం మరువకముందే ఈగల్‌ కాయిన్‌ పేరిట క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది.

ముందే హెచ్చరించిన ‘సాక్షి’

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయి ఆర్థిక సంక్షోభాలు ఉండగా.. ‘క్రిప్టో కరెన్సీ’ ఈగల్‌ కాయిన్‌ సంస్థ డిపాజిట్లు అసలుకే మోసం వస్తుందని ‘సాక్షి’ 2025 మే 23వ తేదీన కథనాన్ని ప్రచురించింది. అప్రమత్తంగా లేకుంటే నిండా మునుగుతారని హెచ్చరించింది. కానీ వ్యాపారులు, సామాన్యులు క్రిప్టో కరెన్సీ వలలో పడ్డారు. అనేక మంది బాధితులు డిపాజిట్లు పెట్టి దిక్కులు చూస్తున్నారు.

రూ.2.25 లక్షలు డిపాజిట్‌ చేస్తే థాయిలాండ్‌ ట్రిప్‌

అదనంగా రోజుకు రూ.900 నుంచి రూ.1,000 చెల్లింపు

అత్యాశకు పోయి బుక్కయిన సామాన్యులు

8 నెలల క్రితం బయటపెట్టిన ‘సాక్షి’

ఇప్పటికే 200 మంది వద్ద రూ.4.50కోట్లు వసూలు

సిరిసిల్లలో ఆరుగురిపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement