అతివలదే అంతిమ తీర్పు
మండలాల వారీగా ఓటింగ్ వివరాలు
థర్డ్ జెండర్స్ ఓటేశారు
75,548 మంది ఓటెయ్యలె
పంచాయతీ పోరులో..
కరీంనగర్ అర్బన్: ఎన్నికల సం‘గ్రామం’లో అతివలే నిర్ణేతలయ్యారు. జిల్లాలో మొత్తం 316 గ్రామ పంచాయతీలకు గానూ 126 గ్రామాల్లో మహిళలే గ్రామ ప్రథమ పౌరురాలిగా సేవలందించనున్నారు. గ్రామ సర్పంచ్‌ల నిర్ణయంలో మహిళల ఓట్లే కీలకమయ్యాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, చిగురుమామిడి మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగగా అన్ని విడతల్లోనూ అతివలే అఽత్యధికంగా ఓట్లు వేశారు. ఎక్కడా పురుష ఓటర్ల ఆధిక్యం కనిపించకపోవడం విశేషం. అత్యధికంగా గంగాధర మండలంలో 2,171 మంది మహిళలు పురుష ఓటర్ల కన్న ఎక్కువ మంది ఓట్లు వేయగా అత్యల్పంగా శంకరపట్నం మండలంలో వంద మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేశారు.
మండలం పురుషులు మహిళలు మహిళల
ఆధిక్యం
ఇల్లందకుంట 11,175 11,544 369
హుజూరాబాద్ 14,915 15,976 1,061
జమ్మికుంట 12,149 12,649 500
వీణవంక 18,140 18,489 349
సైదాపూర్ 13,619 13,978 359
చొప్పదండి 11,145 12,008 863
గంగాధర 16,293 18,464 2,171
కరీంనగర్ రూరల్ 9,233 9,438 205
కొత్తపల్లి 6,810 7,259 449
రామడుగు 16,023 17,411 1,388
చిగురుమామిడి 14,585 14,913 328
గన్నేరువరం 7,533 7,902 369
మానకొండూరు 24,360 24,967 607
శంకరపట్నం 16,617 16,717 100
తిమ్మాపూర్ 15,919 16,670 751
జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో థర్డ్ జెండర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 12 మంది ఓటర్లుండగా 8మంది ఓటేయగా నలుగురు ఓటు వేయలేదు. చిగురుమామిడిలో ఒకరు ఉండగా ఓటు వేయకపోగా మానకొండూరులో ఒకరుండగా ఓటు వేశారు. చొప్పదండిలో ఒకరు, గంగాధరలో ఇద్దరికి ఒకరు ఓటేశారు. కరీంనగర్ రూరల్‌లో ఒకరు, రామడుగులో ముగ్గురుండగా ఒకరు ఓటేశారు. ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఒక్కొ ఓటరుండగా అందరూ ఓటేశారు.
అవును.. అక్షరాల 75,548 మంది ఓటర్లు ఓటు వేయలేదన్నది సుస్పష్టం. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5,02,457 ఓటర్లకు గానూ 4,26,909 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 84.96శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 15 మండలాల్లోని 316 గ్రామ పంచాయతీలకు గానూ 312 గ్రామాల్లో పోలింగ్ జరగగా ఎక్కడా 90శాతం పోలింగ్ నమోదు కాలేదు. తొలి విడతలో 28,320 మంది ఓటర్లు ఓటు వేయకపోగా రెండో విడతలో 24,819, మూడో విడతలో 22,409 మంది ఓటు వేయలేదు. గంగాధర, కొత్తపల్లి మండలాల్లో ఓటేయనివారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత జమ్మికుంట నిలుస్తుంది.


