ప్రభుత్వ విద్యార్థులకు దంత పరీక్షలు
కరీంనగర్‌టౌన్/కరీంనగర్ అర్బన్/మానకొండూర్: జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12వేల మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న దంత వైద్య శిబిరాన్ని గురువారం సందర్శించారు. జిల్లావ్యాప్తంగా 9వేల మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24మందికి చికిత్స అందించామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన, డెంటల్ నిపుణులు రవి ప్రవీణ్, రణధీర్, సాహిత్య, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.
కుష్ఠును శాశ్వతంగా నిర్మూలించాలి
కుష్ఠువ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశ వర్కర్లు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టి కుష్ఠు రోగులను గుర్తించాలన్నారు. ఈనెల 18 నుంచి 31వరకు సర్వేచేసి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజగోపాల్, ఉమాశ్రీ, తహసీల్దార్ విజయ్‌కుమార్, సల్మాన్ పాల్గొన్నారు.
శభాష్.. ఎన్నికల సేన
ఎన్నికల నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటింది కరీంనగర్. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసిన మొదటి జిల్లాగా నిలిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం కలెక్టర్‌తో పాటు యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఇందుకు సహకరించిన అధికారులు, పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. సాధారణ పరిశీలకుడు వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ను సన్మానించారు.


