బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
నగరంలో టెన్షన్.. టెన్షన్
ఉద్రిక్తంగా బీజేపీ ఎంపీ కార్యాలయం ముట్టడి
డీసీసీ చీఫ్ సత్యం హౌస్ అరెస్ట్
కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి బీజేపీ పోటీ పిలుపు
ఎక్కడికక్కడ కట్టడి చేసిన పోలీసులు
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ కార్యాలయ ముట్టడితో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షతో నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ఆందోళన నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా, మార్గమధ్యలో కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొన్నారు. కాంగ్రెస్‌కు పోటీగా డీసీసీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు చౌరస్తా నుంచి జ్యోతినగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్‌చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు ర్యాలీగా బయల్దేరారు. కోర్టు వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని పీటీసీకి, టూటౌన్‌పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంను బాలాజీనగర్‌లోని ఆయన నివాసంలో హౌస్‌అరెస్ట్ చేశారు. సత్యం తన ఇంటి గేటు దూకేందుకు పలుమార్లు ప్రయత్నించగా, పోలీసులు వారించారు. నిరంకుశ పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఆటలు ఇక సాగవని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కాశెట్టి శ్రీనివాస్, సిరాజు హుస్సేన్, బానోతు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, కల్వల రామచందర్, లింగంపల్లి బాబు పాల్గొన్నారు.
డీసీసీ ముట్టడికి బీజేపీ యత్నం
కాంగ్రెస్ నాయకుల బీజేపీ ఎంపీ కార్యాలయ ము ట్టడికి నిరసనగా డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు బయలుదేరడంతో పోలీ సులు అరెస్టు చేశారు. మాజీ మేయర్ సునీల్‌రావు, పార్టీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటోందన్నారు.


