పైసలు పాయే..
కలిసొస్తే పరిషత్‌లో చూసుకుందాం..
పదవీ రాకపాయే..
ఓటమితో డీలా పడిన పంచాయతీ అభ్యర్థులు
ప్రచారం కోసం చేసిన అప్పులు తీర్చడం ఎట్లా?
పోల్ పోస్టుమార్టంలో రాజకీయ పార్టీల నేతలు
పరిషత్ ఎన్నికల వైపు ఓటమిపాలైన అభ్యర్థుల చూపు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలుబడే వరకూ విజయం తనదేననే ధీమాతో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నిక ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా.. ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు.
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్:
జిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు 2,946 వార్డుస్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 సర్పంచ్, 657 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చుచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు డబ్బు, మద్యంతోపాటు విలువైన బహుమతులూ అందజేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు నగదు కూడా పంపిణీ చేశారు. చాలామంది ఆస్తులు విక్రయించగా, కొందరు మరీ అప్పు తీసుకొచ్చారు. ఓటమి పాలయ్యాక అప్పులే మిగిలాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గెలిచిన వారు సైతం అప్పుచేసి గెలిచామని, ఎలా తీర్చాలన్న మదనతో ఉన్నారు.
ఖర్చుకు వెనుకాడలేదు..
సర్పంచ్‌తోపాటు వార్డుస్థానాల్లోని అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. రూ.లక్షల్లో వెచ్చించారు. చెక్‌పవర్ ఉండడంతో రిజర్వేషన్ కలిసిరాని పంచాయతీల్లో వార్డుస్థానాల్లో పోటీచేసిన కొందరు ఉప సర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలని వ్యూహం పన్నారు. వార్డు అభ్యర్థులు.. సర్పంచ్ అభ్యర్థులతో సమానంగా ఖర్చు చేశారు. ఫలితం తేడా రావడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఫలితాలపై విశ్లేషణ..
ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తే గెలుపు ‘నల్లేరుపై నడకే’నని భావించిన కొందరు ఓటమి చెందారు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషించుకుంటున్నారు. నగదు పంపిణీ, తమ క్యాంపులో ఉంటూ ప్రత్యర్థికి సహకరించిన వారెవరనే కారణాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. రెబల్స్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు.. పార్టీలో ఉండి రెబల్స్‌కు సహకరించిన వారిని గుర్తించి, వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేస్తున్నారు. వారిపై ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు సహకరించిన వారిపై తమ పార్టీ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు.. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ఈసారి పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా రిజర్వేషన్ కలిసి వస్తే ఓడిపోయిన సానుభూతితో ఎంపీటీసీగా గెలవవచ్చని భావిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల వేళ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాల సమయంలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవచ్చని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు.
పైసలు పాయే..


