ఇప్పుడు గులాం
సర్పంచ్‌గిరీకి ఓ సలాం..
సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవికి ఎంతో మంది నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు, సమీప బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు బంధాలను మరిచి బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటాపోటీగా నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో వ్యూహాలు అమలు చేశారు. మందు విందులు, నోట్ల పంపిణీ, చీరల పంపిణీ ఇలా అభ్యర్థులు చేయని ప్రలోభాలు లేవు. ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లోనూ వేలం పాటలు, భూమిని విరాళంగా ఇవ్వడం, ఊరందరికీ అక్కరకు వచ్చే పనులు చేసేందుకు నగదు ఇవ్వడం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్కోక్కరు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఊరిలోనే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన పదవీ కాంక్ష ఏమేరకు ప్రభావం చూపిందో అర్థమవుతుంది.
ఇవీ గ్రామాల్లో గతానుభవాలు
శాసించే తుపాకుల మధ్య గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, ఆఖరికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలున్నాయి. గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు పోలీసుల బూట్ల చప్పుడు, నక్సలైట్ల తుపాకుల మోతలతో తెల్లవారేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఊరికి దూరంగా పట్టణాల్లో నివాసం ఉండేవారు. కొందరైతే రాత్రి అయితే ఊరు విడిచి వెళ్లేవారు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు ప్రజాప్రతినిధులను పోలీస్ ఇన్‌ఫార్మర్లు అంటూ.. టార్గెట్ చేసి భౌతికదాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాభివృద్ధికి వచ్చే జవహర్ రోజ్‌గార్ యోజన(జేఆర్‌వై) నిధులను మింగారంటూ, అనేక మంది సర్పంచులపై దాడులు జరిగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ‘సర్పంచ్ గిరీకి ఓ సలాం.. మాకు వద్దు ఆ పదవి’ అంటూ దూరంగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. అందుకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి.
గతం గాయాలు ఇవీ..
● ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, మాజీ సర్పంచ్‌లను మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు పోలీస్ ఇన్‌ఫార్మర్లు అంటూ హత్య చేశారు.
● రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సర్పంచ్ రాధాకిషన్‌రావును నక్సలైట్లు హత్య చేశారు. ఇదే మండలం సుద్దాల మాజీ సర్పంచ్ ఏనుగు ప్రభాకర్‌రావు అలియాస్ వేణుగోపాల్‌రావును మారుపాక శివారులో చంపేశారు.
● చందుర్తి మండలం రామారావుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పోతుగంటి భాస్కర్‌ను చంపేశారు.
● ఎల్లారెడిపేట మండలం కంచర్లకు చెందిన మాజీ సర్పంచ్ సూర వెంకటిని, ఇదే మండలం సింగారంకు చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య ను, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఎల్సాని మల్లయ్యను నక్సలైట్లు చంపేశారు.
● గంభీరావుపేట మండలం గజసింగారంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డిని కాల్చి చంపారు.
● జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ బచ్చు నందంను హత్య చేశారు.
● పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీపతి రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ తుల సుధాకర్‌రావును, ఇదే మండలం పెద్దరాతిపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డిని చంపేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక మంది నక్సలైట్ల తూటాలకు బలి అయ్యారు. నక్సలైట్లు చేసిన భౌతికదాడులకు లెక్కే లేదు. ఇలాంటి పరిస్థిల్లో రెండు దశాబ్దాల కిందట సర్పంచ్ పదవి ముళ్ల కిరీటంలా భావించి తమకు వద్దు అనేవారు. కానీ, నక్సలైట్ల కదలికలు క్షీణించడంతో పల్లెల్లో ఎన్నికల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు వచ్చాయి.
నాడు పోటీకి నై.. నేడు సై..
మారిన పల్లె ముఖచిత్రం
రెండు దశాబ్దాల కిందట పల్లెల్లో కల్లోలం
ప్రాబల్య ప్రాంతాల్లో ‘అన్నలదే’ రాజ్యం
ఇన్‌ఫార్మర్ల పేరిట సర్పంచ్‌లను హత్య చేసిన నక్సలైట్లు
ఇప్పుడు గులాం


