కుష్ఠు నిర్మూలనే లక్ష్యం
కరీంనగర్/పెద్దపల్లి: కుష్ఠు నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వ్యాధిని తొలదశలోనే గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటా రెండోవిడత సర్వేకు శ్రీకారం చుట్టింది. ఏటా రెండుసార్లు సర్వే నిర్వహిస్తోంది. ఈఏడాది మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు తొలివిడత సర్వే నిర్వహించింది. అప్పుడు కరీంనగర్ జిల్లాలో సుమారు వెయ్యి మందికిపైగా, పెద్దపల్లి జిల్లాలో 216మంది అనుమానితులను గుర్తించారు. పరీక్షల అనంతరం కరీంనగర్‌లో 8 మంది, పెద్దపల్లి జిల్లాలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్లు తేలింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన రెండోవిడతలో కరీంనగర్ జిల్లాలో 2 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 9,372 ఇళ్లలో సర్వే చేస్తారు. ఇందుకోసం కరీంనగర్‌లో 645 మంది ఆశ కార్యకర్తలు, 250 మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, సూపర్‌వైజర్లు, పెద్దపల్లి జిల్లాలో 638 మందితో సర్వే చేయన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 29 మందికి చికిత్స అందిస్తున్నారు. చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యుల ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంపై స్ప ర్శలేని మచ్చలు, నరాలవాపు, నొప్పితెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠుగా అనుమానిస్తారు.
వ్యాధి లక్షణాలు..
● చర్మంపై స్పర్శలేని రాగిరంగు మచ్చలు. చెవులపై బుడిపెలు, కణితులు, నరాల తిమ్మిర్లు.
● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం
● కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం
● కనురెప్పలు మూతపడకపోవడం
● చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం
● చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం
● కాళ్ల చెప్పులు జారిపోవడం
● చల్లని, వేడివస్తువులు గుర్తించకపోవడం
● పాదాలు, మడమల్లో వాపు రావడం
● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం.
చికిత్స విధానం..
కుష్ఠు నివారణకు రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసివ్‌బ్యాసిలరీ(పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవారికి మల్టీబ్యాసిలరీ(ఎంబీ) విధానంలో చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నెలకు ఒకసారి మందులను పేషెంట్ల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడంతోపాటు ఆ వ్యాఽధిపై అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. బాధితులకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు.
12 నెలల పాటు చికిత్స..
మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మక్రిమితో కుష్టు సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణా లు బహిర్గతమయ్యేందుకు సగటున 3ఏళ్ల నుంచి 5ఏళ్ల సమయం పడుతుంది. వ్యాధి ఎవరికై న రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6నెలల నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు.
వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే
రేపటి నుంచి 31వరకు ఇంటింటా సర్వే
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు


