బిడ్డను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి..
● వ్యవసాయబావిలో ఆటోపడి మహిళ మృతి
జూలపల్లి(పెద్దపల్లి): తన కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన తల్లి అనూహ్యంగా మృత్యుఒడిలోకి చేరుకుంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట – ధూళికట్ట మధ్య మంగళవారం చోటుచేసుకుంది. ఘటనలో బోమ్మగాని చిలుకమ్మ(55) దుర్మరణం చెందింది. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం ముంజంపెల్లికి చెందిన బోమ్మగాని చిలుకమ్మ.. తన కూతురు రమ్యను ధూళికట్టకు చెందిన దుర్గం నగేశ్‌కు ఇచ్చి వివాహం చేసింది. రమ్యను చూసేందుకు చిలుకమ్మ ఇటీవల ధూళికట్టకు వచ్చింది. ముంజంపెల్లిలో బుధవారం జరిగే ఎన్నికల్లో చిలుకమ్మ ఓటువేయాల్సి ఉంది. ఆమెను తీసుకెళ్లేదుకు కుమారుడు సతీశ్ ధూళికట్టకు వచ్చాడు. ఈక్రమంలో బావ దుర్గం నగేశ్‌తో కలిసి సతీశ్ మద్యం తాగారు. ఆ తర్వాత నగేశ్ తన ఆటోలో అత్త చిలుకమ్మ, బామ్మర్ది సతీశ్‌ను తీసుకుని చీమలపేటలో దింపేందుకు బయలు దేరాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి వ్య వసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఆటోలోని చిలుకమ్మ నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెంది. నగేశ్, సతీశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతురాలి కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఫణి శివాజీ(35) కడుపునొప్పి భరించలేక క్రిమిసంహరిక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. శివాజీ 2021లో బెటాలియన్ కానిస్టేబుల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సెలవులపై స్వగ్రామమైన కొమిరకు వచ్చారు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు నిత్యం వెళ్లి వ్యవసాయ పనులు చూసుకునేవారు. ఈక్రమంలో మంగళవారం అక్కడకు వెళ్లగా కడుపునొప్పి వచ్చింది. భరించలేక అక్కడే క్రిమిసంహరిక మందుతాగారు. స్థానికులు గమనించి సుల్తానాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య తేజస్విని, కుమారుడు(2) ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
దేవునిపల్లిలో యువకుడు..
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కె.గణేశ్(27) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారులోని మంథని ఫ్లైఓవర్ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు(2) ఉన్నట్లు వివరిబంచారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
బిడ్డను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి..


