దేహదానానికి తల్లీబిడ్డల అంగీకారం
జ్యోతినగర్(రామగుండం): తమదేహాలు దానం చేసేందుకు తల్లీబిడ్డలు అంగీకరించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సామ శిరీష, ఆమె తల్లి శారద తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తమ మరణానంతరం నేత్రాలు, అవయవాలతోపాటు శరీరాన్ని కూడా దానం చేస్తామని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష చదువుతోపాటు విలువలు కూడా బోధించాల్సిన బాధ్యతను ఆచరణలో చూపించారు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె తల్లి శారద సదాశయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అవయవదాన అవగాహన కార్యక్రమాల ప్రభావంతో ఈ మహత్తర నిర్ణయానికి వచ్చారు. మరణానంతరం ఇతరులకు చూపు, జీవితం అందించడంతో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా శరీరాన్ని దానం చేయాలని శారద తన కూతురు శిరీషకు తెలియజేశారు. తల్లి ఆలోచనను గౌరవించిన శిరీష కూడా అదే బాటలో నడుస్తానంటూ తల్లితో పాటు తాను కూడా అవయవాలు, శరీరాన్ని దానం చేస్తానని అంగీకరించారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో తల్లి, బిడ్డ ఇద్దరూ తమ అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, జిల్లా సలహాదారు తడబోయిన రామన్న వారిని శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, భీష్మాచారి, వాసు, వెద్దీ అనంతరాములు, కవిత, రఘురాం తదితరులు ప్రశంసించారు.


