కర్ల రాజేశ్ మృతికి పోలీసులే కారణం
జ్యోతినగర్(రామగుండం): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళితుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కోరారు. ఈమేరకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ జ్యోతిభవన్‌కు చేరుకున్న మందకృష్ణ మాదిగ.. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్‌ను కలుసుకుని పూలమొక్క అందించారు. కర్ల రాజేశ్ లాకెప్‌డెత్‌కు కారణమైన సూర్యపేట సీఐ, కోదాడ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోరెన్సిక్ నిపుణులతో రాజేశ్ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం చేయించాలన్నారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతోనే రాజేశ్ మరణించాడని ఆరోపించారు. సూర్యాపేట పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తమకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై అక్రమ నిర్బంధాలు, దాడులు జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించేందుకు ఐక్య పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్ట్‌మార్టం జరిపించాలి
లాకెప్ డెత్‌కు కారణమైన పోలీసులపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ


