గోదావరిలో స్నానానికి వచ్చి..
● గల్లంతైన వ్యక్తి మృతి
వెల్గటూర్(ధర్మపురి): గోదావరిలో స్నానానికి వచ్చి గల్లంతైన వ్యక్తి మృతిచెందిన ఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గోలెం మల్లయ్య (53) సమీప బంధువు మృతిచెందగా అతడి అంత్యక్రియలకు వెళ్లాడు. ఆదివారం ఇంట్లో మల్లన్న బోనాల కార్యక్రమం ఉండడంతో శనివారం గోదావరి స్నానానికి కోటిలింగాలకు వచ్చాడు. సాయంత్రం కావడంతో పుష్కర ఘాట్లపై కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించగా మల్లయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి బావ నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
జమ్మికుంట: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన పార్వతి రాజయ్య(46) అనారోగ్యంతో ఈ నెల 10న పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాజయ్య ట్రాక్టర్ డ్రైవర్. భార్య వనజ, కొడుకు ఉన్నారు. కొడుకు శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.


