ఇయాల్నే
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
రెండో తీర్పు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
జిల్లాలోని ఐదు మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, ఆనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం. గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 1,046 వార్డులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో రెండు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 111 గ్రామ పంచాయతీ స్థానాలకు 438 మంది బరిలో ఉన్నారు. 1,046 వార్డుమెంబర్ స్థానాలకు గానూ 197 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 849 వార్డు స్థానాలకు గానూ 2,476 మంది బరిలో ఉన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి
రెండో విడత ఎన్నికలు జరిగే మండలాలకు సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. మానకొండూర్ మండలానికి మానకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిమ్మాపూర్‌కు వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, శంకరపట్నంకు కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గన్నేరువరం మండలానికి సంబంధించి జంగపెల్లి హైస్కూల్, చిగురుమామిడి మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాల యం నుంచి సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. 1,046 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సిబ్బందికి అందజేశారు. ప్రిసైడింగ్ అధికారులు శనివారం సాయంత్రం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 18 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి, ఒక్కో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. అదనంగా చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. మేజర్ గ్రామపంచాయతీలు మినహా మిగితా గ్రామాల్లో సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశ ముంది. మూడువేలకు పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఏడు గంటల వరకు, ఐదువేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది గంటలవరకు పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
మేజర్ గ్రామాల్లో ప్రలోభాల ప్రవాహం
రెండోవిడత పోలింగ్ జరిగే పల్లెల్లో ప్రలోభాల ఎర తీవ్రమైంది. గ్రామాల్లోని మహిళా సంఘాలు, యువకులను ప్రసన్నం చేసుకునేందుకు శనివారం రాత్రివరకు ప్రయత్నాలు నిర్వహించారు. జనరల్ స్థానాలు వచ్చిన పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండలకేంద్ర సర్పంచ్ స్థానాలతో పాటు ఆదాయం ఉన్న గ్రామాల్లో అభ్యర్థులు ఖర్చు కు వెనకాడడం లేదు. ఒక్కోచోట రూ.20లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఖర్చుకు సై అంటున్నారు.
144 సెక్షన్ అమలు
పోలింగ్ జరిగే 113 గ్రామపంచాయతీల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పో లింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. పోలింగ్ రోజు అభ్యర్థులు కానీ, అభ్యర్థుల తరఫునవారు అల్పాహారం, భోజనం పెట్టడం, వాహనాల్లో ఓటర్లకు చేరవేయడం చేయరాదు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయొద్దు. గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు తీయరాదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
మానకొండూర్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ప్రతి కౌంటర్‌ను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏవైన సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు.
84


