బీజేపీ సర్పంచ్‌లున్న గ్రామాలకు పెద్దపీట
కొత్తపల్లి(కరీంనగర్): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు అసూయ పడేలా బీజేపీ సర్పంచులున్న గ్రామాలకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో కేంద్ర మంత్రి శనివారం కరీంనగర్ శివారులోని రాజశ్రీ గార్డెన్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులను శాలువాతో సత్కరించారు. సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుంటుపడటంతో రాబోయే రోజుల్లో సర్పంచ్‌లపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశముందన్నారు. బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్‌లు ఎవరూ బాధపడొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్‌తోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఈ నెల 18లోపు మాత్రమే బీజేపీలోకి వస్తే ఆ గ్రామాలకు కూడా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానన్నారు. 18 తర్వాత ఏ పార్టీవారిని చేర్చుకునేది లేదని డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరకముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిని గోపి, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్ రావు పాల్గొన్నారు.


