అంతుచిక్కని ఓటరు నాడి
కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ఓటు అడిగేందుకు ఇంటికి వస్తున్న అభ్యర్థులను నిరాశ పర్చడం లేదు. మా ఓటు మీకే అంటూ హామీ ఇస్తూ ఉత్సాహపరుస్తున్నారు. మీకు కాకుంటే ఎవరికేస్తాం అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఏ అభ్యర్థి ప్రచారానికి వెళ్లినా ఓటర్ల నుంచి ఇదే సమాధానం వస్తోంది. దీంతో అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఓట్లు చేజారకుండా చూసుకునే పనిలోనే ఉంటున్నారు. మొదటి విడత ఎన్నికలు పూర్తవ్వగా, నేడు రెండో విడత జరగనున్న నేపథ్యంలో ప్రచారవేడీ మరింత పెరిగింది. మూడో విడత ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యక్షంగా ఓటు అడగడమే కాకుండా, ఓటర్లు ఎవరి మాట వింటారు, ఎవరి ప్రభావంలో ఉంటారు అనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటూ మధ్యవర్తుల ద్వారా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఓటే గెలుపు– ఓటములను నిర్ణయించే స్థితి ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దన్న భావన అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు గ్రామాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యమని హామీలు గుప్పిస్తున్నారు. యువత, మహిళల ఓటు కీలకమని గుర్తించిన అభ్యర్థులు వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ హామీల మధ్య నిజమైన ఓటరు తీర్పు మాత్రం బ్యాలెట్‌బాక్సు వద్దే బయటపడనుంది. చివరి క్షణం వరకు ఎవరికి ఓటు పడుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండటమే గ్రామీణ రాజకీయాల్లో ఓటరు స్వతంత్రతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా ఓటరు మనసు గెలవడం ఎంత కష్టమో అభ్యర్థులకు స్పష్టంగా అర్థమవుతోంది.


