852 మంది పోలీసులతో బందోబస్తు
కరీంనగర్‌క్రైం/శంకరపట్నం: రెండో విడత పంచాయతీ ఎన్నిలకు 852 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. పోలీసు కమిషనరేట్ కేంద్రంలో శనివారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లడుతూ.. ఐదు మండలాల పరిధిలో జరిగే ఎన్నికలకు ఆరుగురు ఏసీపీలు, 18 మంది సీఐలు, 36 మంది ఎస్సైలు, 37 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 450 మంది కానిస్టేబుళ్లు, 40 మంది స్పెషల్‌యాక్షన్ టీంలు, 165 మంది హోంగార్డులు, 100 మంది స్పెషల్ బెటాలియన్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తిమ్మాపూర్, శంకరపట్నం, మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లోని 113 గ్రామాల్లో ఏర్పాటు చేసిన 1,046 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, ఒక్కో మండలానికి ఏసీపీ ఇన్‌చార్జిగా ఉండడంతో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 15 కేసులు నమోదు చేశామన్నారు. శంకరపట్నం మండలకేంద్రంలో ప్రభుత్వ మాడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.


