మృతశిశువుతో ఆందోళన
హుజూరాబాద్: హుజూరాబాద్ ఆస్పత్రి ఎదుట మృత శిశువుతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత ఎనిమిది నెలల గర్భిణీ. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గర్భస్రావమైంది. వైద్యులు పరీక్షించి శిశువు చనిపోయి రెండురోజులు అవుతుందని చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు హుజూరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు.


