తొలి విడతకు సన్నద్ధం
కరీంనగర్ అర్బన్: తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతోంది. మొత్తం 92 పోలింగ్ కేంద్రాలుండగా 3,464 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించగా అదనంగా వందకు పైగా నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, ఇద్దరు సిబ్బందితో కలిపి మొత్తం నలుగురు విధులు నిర్వహించనున్నారు. వీరికి శిక్షణ ప్రారంభమైంది. ఇప్పటికే తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగియగా ఆదివారం రెండో దశ ముగిసింది. శిక్షణలో బ్యాలెట్‌పై ఎలా ఉపయోగించాలనే దానిపై మాస్టర్ ట్రైనర్లు వివరిస్తున్నారు. మాక్ పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు.
రెండో దశ పూర్తి
ఇప్పటికే రెండు దశల్లో ర్యాండమైజేషన్‌ను అధికారులు పూర్తి చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే 92 గ్రామాల్లో 866 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ రోజున సదరు బాక్స్‌లను ఉపయోగించనున్నారు. రెండో దశ పూర్తి కావడంతో వాటిని భద్రపరిచారు. మొదటి, రెండు దశల ర్యాండమైజేషన్ జిల్లాస్థాయిలో జరగగా పోలింగ్ జరగడానికి ఒకరోజు ముందు కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
సెక్టోరియల్ అధికారులపై దృష్టి
ఎన్నికల సామగ్రి సరఫరా, పోలింగ్‌తో పాటు కౌంటింగ్ వరకు సెక్టోరియల్ అధికారులే కీలక భూమిక పోషిస్తారు. ప్రతి సెక్టోరియల్ అధికారి పర్యవేక్షణలో పీవోలు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులను నియమించి శిక్షణనిస్తున్నారు. పోలింగ్ రోజు రూట్ల వారీగా ఎన్నికల సామగ్రిని తరలించనున్నారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలి. కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే దృష్టి సారించాలి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా అప్పటివరకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశమిస్తారు. పోలింగ్ ముగిసిన తదుపరి అదే రోజు ఓట్ల లెక్కింపుతో విజేతను ప్రకటించి వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించాలి.
ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరిగే
మండలాలు: 05(గంగాధర, రామడుగు,
కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, చొప్పదండి)
ఎన్నికలు జరిగే గ్రామాలు: 92
వార్డు మెంబర్ స్థానాలు: 866
పోలింగ్ సిబ్బంది: 3,464
పోలింగ్ కేంద్రాలు: 92, పోలింగ్ బూత్‌లు: 866


