అప్పుడే సర్పంచ్!
ఆస్తులు, నగలు తనఖా
ఏకగ్రీవాల తర్వాత మొదటి విడత ఇలా..
స్థిరాస్తులు కుదువపెడుతున్న అభ్యర్థులు
హామీలు, నామినేషన్ విత్‌డ్రా కోసం భారీగా ఖర్చు
అప్పుల ఊబిలో యువనేతలు
గెలిచినా, ఓడినా తప్పని రుణభారం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్‌లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్‌గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం.
గెలవకపోతే అప్పుల ఊబిలో..
వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్‌డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.
జిల్లా పంచాయతీలు అభ్యర్థులు
కరీంనగర్ 89 388
జగిత్యాల 118 461
పెద్దపల్లి 95 376
రాజన్నసిరిసిల్ల 76 295
అప్పుడే సర్పంచ్!


