ఆలస్యమైనా పదవులు పక్కా
కష్టపడితే కాంగ్రెస్‌లో గుర్తింపు
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
డీసీసీ అధ్యక్షుడిగా సత్యం బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ కార్పొరేషన్: పార్టీ వెన్నంటి ఉన్న వాళ్లకు కాస్త ఆలస్యమైనా పదవులు పక్కాగా వస్తాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం డీసీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం మాట్లాడుతూ కష్టపడితే కాంగ్రెస్‌లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా సత్యం ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ చెప్పినట్లు కాళ్లల్లో కట్టె పెట్టేటోళ్లకు కాకుండా అభివృద్ధి చేసేటోళ్లకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇవ్వాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసినంత కాలం కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరన్నారు. పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొనే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాల మేరకే తనను, అర్బన్ అధ్యక్షుడిగా అంజన్‌ను నియమించారన్నారు. పైరవీలకు తావు లేదని, క్షేత్రస్థాయిలో అభిప్రాయాల మేరకు టికెట్‌లు వస్తాయన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్, కొడూరి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌పార్టీ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి డీసీసీ కార్యాలయం వరకు సత్యంను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంబేడ్కర్, గాంధీ తదితర విగ్రహాలకు సత్యం పూలమాలలు వేశారు. సాయంత్రం కావడంతో ర్యాలీతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు ఇబ్బంది పడ్డారు.


