నువ్వు సర్పంచ్.. నేను ఉప సర్పంచ్
సర్పంచ్ రిజర్వేషన్ కలిసిరాని చోట ఉపసర్పంచ్‌పై ఫోకస్
వార్డు మెంబర్‌గా పోటీ.. సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు
నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్‌తో తీవ్రపోటీ
కరీంనగర్: రిజర్వేషన్లు కలిసిరాక సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కోల్పోయిన చోట ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉపసర్పంచ్‌గా ఎన్నికై తే ఎంతో కొంత పెత్తనం కొనసాగుతుందనే ఆలోచనతో వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని చాలాచోట్ల రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పాటు మహిళలకు 50 శాతం సర్పంచ్‌స్థానాలు రిజర్వ్ కావడంతో కీలకనాయకులకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్ పదవి చేపట్టాలని భావిస్తున్నారు.
వీరూ.. కీలకమే..
గ్రామపాలనలో ఉపసర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్‌ఫుల్‌గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్‌పవర్‌ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఉపసర్పంచ్ పోస్టును బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరు సాగుతుంది. దీంతో రిజర్వుడ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. చాలామంది జనరల్ అభ్యర్థులు వార్డు మెంబర్‌గా విజయం సాధించి ఉపసర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారు. అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఉపసర్పంచ్ పదవిని కూడా ఎన్నుకోవాల్సి ఉన్నందున ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్నారు. తాము పోటీచేస్తున్న వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు.
చెక్ పవర్‌తో పెత్తనం..
ఉప సర్పంచ్‌లకు సర్పంచ్‌తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది.గ్రామపంచాయితీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్‌పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్‌లకే అప్పగించింది. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైతే సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్‌ను ఇందులో భాగస్వామిని చేయకపోవడం గమనార్హం. దీంతో మహిళలు సర్పంచ్‌లుగా ఉన్న చోట్ల పెత్తనం చెలాయించడానికి ఉపసర్పంచ్ పదవి ఎంతో అనుకూలమనే భావనలో కొందరు నాయకులు ఉన్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీచేసే అవకాశం దక్కని వారు ఉపసర్పంచ్ పదవిపై కన్నేసి పావులు కదుపుతున్నారు.


