వలస కూలీల పిల్లలను గుర్తించండి
కరీంనగర్‌టౌన్/తిమ్మాపూర్: జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మండల విద్యాధికారులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వలస కూలీలు ఎక్కువగా పనిచేసే చోటే వర్క్‌సైట్ స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి ఈ బడిలో చేర్పించాలన్నారు. పిల్లలకు పోషకాహారం, దుస్తులు, పుస్తకాలు అందిస్తామన్నారు. ఇటుక బట్టీల యజమానులు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికే 185మంది పిల్లలను గుర్తించినట్లు విద్యాధికారులు కలెక్టర్‌కు వివరించారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు స్లిప్‌టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. మండల విద్యాధికారులు వారానికి రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలన్నారు. స్నేహిత ఫిర్యాదుల పెట్టెను నిర్వహించాలన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టి
అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతోపాటు పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అలుగునూర్‌లోని కాకతీయకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. పోషకాహారంతోపాటు ఆలనాపాలన చూ సే అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులు 4 ఏఎన్‌సీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఖరీదైన టీఫా స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ పాల్గొన్నారు.


