రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్
● జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య వెల్లడి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ వేదికగా ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లాస్థాయి మెగా వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శన 2024–25ను నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీరామ్ మొండయ్య వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా 717 నమూనాలు నమోదు చేయడం జరిగిందని, ఇందులో 7 జూనియర్, 7 సీనియర్ రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనకు 126 నమూనాలు నమోదు చేయబడ్డాయని, ఇందులో 13 నమూనాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డిలతో కలిసి గురువారం మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ప్రదర్శన విశేషంగా దోహదపడుతుందన్నారు. ఎంఈవో ఆనందం, డీసీఇబీ కార్యదర్శి భగవంతరావు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సమన్వయకర్త అనంతచార్య, జిల్లా ప్రణాళిక సమన్వయకర్త మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.


