నగరపాలక సంస్థ కాదు.. నరకపాలక సంస్థ
కరీంనగర్ కార్పొరేషన్: పాలకవర్గం ముగిసిన తొమ్మిది నెలల్లోనే నగరపాలకసంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నరకపాలక సంస్థగా మార్చిందని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక అధికారి పాలనలో నగరాన్ని చీకటిమయంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో కనీసం 20 శాతం పనులు కూడా చేయలేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తాము ఎన్నోసార్లు కలెక్టర్, కమిషనర్‌కు విన్నవించినా.. పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వంలో రూ.135 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి, రూ.65 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. మెయిన్‌రోడ్లు ధ్వంసం అయితే కనీసం తట్టెడు మట్టిపోసే దిక్కులేదన్నారు. నగరప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలో బల్దియా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు షౌకత్, బోనకుర్తి సాయికృష్ణ, నవాజ్, చేతి చంద్రశేఖర్, ఆరె రవిగౌడ్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, జెల్లోజీ శ్రీనివాస్, గూడెల్లి రాజ్ కుమార్, నారదాసు వసంతరావు, కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.


