ఫైరింగ్ రేంజ్ ఎలగందలనే
ఆస్తుల పరిరక్షణ,సదుపాయాలు
సైదాపూర్ గుట్టల వైపు తరలింపు ప్రతిపాదన నిలిపివేత
ఎక్స్‌పర్ట్ టీం సూచనతో రీటెయినింగ్ వాల్ నిర్మాణం
అప్పటి వరకు ఫైరింగ్ సాధన
నిలిపివేతకు ఆదేశాలు
త్వరలో గోదాంగడ్డ క్వార్టర్స్ కూల్చి, పునర్నిర్మాణం
నూతనంగా నాలుగు ఠాణాలు,
2 ఏసీపీ ఆఫీసులకు ప్రతిపాదన
పలు ఠాణాల ఆధునీకరణ,
సదుపాయాల కల్పన
పోలీసు ఆస్తుల పరిరక్షణపై
సీపీ గౌస్ ఆలం దృష్టి
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
కరీంనగర్ పోలీసులు ఫైరింగ్ సాధన కోసం వినియోగిస్తున్న ఎలగందుల ఫైరింగ్ రేంజ్‌ను అక్కడే కొనసాగించాలని పోలీసు డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. వాస్తవానికి ఇటీవల ఎలగందులలోని బోనాలపల్లెలో పోలీసులు కాల్చిన పలు తూటాలు గ్రామస్తులను తాకడంతో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిపుణులతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ వచ్చి ఫైరింగ్ రేంజి వద్ద ఘటనపై ఆరా తీసింది. సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యపై అధ్యయనం చేసింది. అందులో భాగంగా పలు సూచనలు చేసింది. ఒక దశలో ఫైరింగ్ రేంజ్‌ను జనావాలసాలకు దూరంగా సైదాపూర్ గుట్టల వద్దకు తరలించాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించింది. అయితే, దూరాభారం వల్ల ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఎక్స్‌పర్ట్ కమిటీ సూచన మేరకు ప్రస్తుతానికి పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ నిలిపివేశారు. తాజాగా పోలీసులు కాల్చిన బుల్లెట్లు దిశ మార్చుకుని జనావాసాల వైపు వెళ్లకుండా రీటెయినింగ్ వాల్ నిర్మించాలని సూచించింది. దీంతో ఈ మేరకు గోడ కట్టేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. గోడ నిర్మాణం పూర్తయ్యాకే..ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభం కానుంది.
కొత్త భవనాలు, సదుపాయాలు..
కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసు ఆస్తుల పరిరక్షణ, ఠాణాలు, భవనాల్లో సదుపాయాలు పెంచేందుకు సీపీ గౌస్‌ఆలం దృష్టి సారించారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలోని ఠాణాలకు కొత్త హంగులు రానున్నాయి. ప్రస్తుతమున్న నాలుగు ఠాణాలకు కొత్త భవనాలతోపాటు, రెండు ఏసీపీ కార్యాలయాల నిర్మాణానికి సీపీ ప్రతిపాదనలకు ఉన్నతాధికారుల నుంచి సానుకూలత వచ్చింది.
● ఇల్లందకుంట, కేశవపట్నం, కొత్తపల్లి, గన్నేరువరం, ఏసీపీ రూరల్ ఆఫీస్, హుజురాబాద్ ఏసీపీ ఆఫీస్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు.
● గోదాంగడ్డలో 4 ఎకరాల క్వార్టర్స్‌ను త్వరలో డిమాలిషన్ చేసి నూతనంగా నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తారు.
● కమిషనరేట్‌లో ఉన్న ఒకప్పుడు ఆసుపత్రి కోసం వినియోగించిన భవనాన్ని ఇప్పుడు రిక్రియేషన్ క్లబ్‌గా మార్చేందుకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
● కరీంనగర్ కమిషనరేట్‌లో నూతన సిబ్బంది కారణంగా అన్ని ఠాణాలు ఇరుకుగా మారాయి. సిబ్బందికి సందర్శకులు, ఫిర్యాదుదారులు తోడవడంతో మహిళా పోలీసులకు కనీసం టాయిలెట్లు వాడుకునేందుకు ఒక్కోసారి వీలు పడటం లేదు. అందుకే, ఈ ఇబ్బంది అధికంగా ఉన్న టూటౌన్‌లో అదనంగా మొదటి అంతస్తు నిర్మిస్తున్నారు. మిగిలిన ఠాణాల్లోనూ అవసరాన్నిబట్టి అదనపు నిర్మాణాలు చేపట్టనున్నారు.
● త్రీ టౌన్ వెనకాల ఉన్న క్వార్టర్స్‌ను కూల్చేసి త్వరలో అక్కడ కొత్త భవనాలను నిర్మించనున్నారు. సీసీఎస్ భవనాలను ఆధునీకరించారు.
● ఎస్బీ కార్యాలయం ఆధునీకరణ ఇటీవల పూర్తి చేశారు. జమ్మికుంట ఠాణాలో జిమ్ ఏర్పాటుచేస్తున్నారు. కరీంనగర్ రూరల్ పీఎస్, విమెన్ పీఎస్‌లో పార్కు సదుపాయం. త్వరలో కమిషనరేట్‌లో బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్టు నిర్మాణం.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించాం. అందులో భాగంగా గోదాంగడ్డలోని నాలుగెకరాల్లో ఉన్న క్వార్టర్స్ ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయించాం. నాలుగు ఠాణాలు, రెండు ఏసీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. కమిషనరేట్‌లోనూ పలు ఆధునీకరణ పనులు ప్రారంభించాం. అలాగే, ఎలగందుల ఫైరింగ్ రేంజిలో గోడ నిర్మాణం కాగానే తిరిగి ఫైరింగ్ సాధన ప్రారంభమవుతుంది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు పోలీసు ఆస్తుల పరిరక్షణ, సిబ్బందికి మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యమిస్తున్నాం.
– సీపీ గౌస్ ఆలం


