ఖర్చులకు పైసలెట్లా?
నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల వ్యయంపై ఆశావహుల ఆందోళన
డబ్బుల సర్దుబాటు కోసం పడరానిపాట్లు
నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
అన్నా.. రిజర్వేషన్ కలిసోచ్చింది. పోటీ చెయ్.. మద్దతుగా ప్రచారం చేస్తామని ఎమ్మెల్యే అంటున్నరు. బరిలో నిలవాలని పెద్దమనుషులు సైతం చెబుతున్నరు. అంతా బాగానే ఉంది కానీ.. పోటీ అంటే ఖర్చుతో కూడుకున్నది కదా.. ఎంతమంచి పేరున్నా తక్కువలో తక్కువ రూ.20 లక్షలు లేనిది గట్టెక్కలేం. నా కాడ కొంత ఉంది.. మా సడ్డకుడు కొంత అడ్జెస్ట్ చేస్తమంటున్నరు. ఐదో, పదో నువ్వు సూడు. గెలిచినంక నాకున్న అరఎకరం అమ్మి పైసలు అప్పజెప్త. ఇప్పుడు అమ్మితే అడ్డికి పావుషేరడుగుతరు. కావాలంటే భూమి నీ పేరు మీద రాసిస్త.
– ఎన్నికల వ్యయం సర్దుబాటు కోసం ఆశావహుల తిప్పలు ఇవీ..
అన్నా నమస్తే.. రిజర్వేషన్ కలిసొచ్చింది. పోటీ చేస్తున్నవట కదా? అని ఖద్దరు చొక్కా ధరించిన నేతలనున గ్రామస్తులు అడుగుతున్న మాట. ఎన్నికల ఖర్చు భయపెడుతుండడంతో కొందరు పోటీకి వెనుకాడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో పరిస్థితి బాగోలేదని, రూ.లక్షలు ఖర్చుపెట్టి పోటీచేసి గెలిచినా మునపటి మాదిరిగా పెద్దగా ప్రయోజనం కూడా ఏమీ ఉండదని ఆశావహులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.లక్షలు ధారపోసి పోటీచేయడం కన్నా సైలెంట్‌గా ఉండడమే ఉత్తమని చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
సాక్షి పెద్దపల్లి●:
గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతోపాటే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది. ఫలితంగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల కోలాహలం నెలకొంది. గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చు చేసేందుకు ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఆయా రాజకీయ పార్టీల మద్దతు కూడకట్టేందుకు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రూ.30లక్షల ఖర్చుకై నా సిద్ధం..
మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పోటీచేసే అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసేందుకై నా వెనుకాడడం లేదు. మరికొందరు తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధికి డబ్బులు నజరానాగా ఇస్తామని వాగ్ధానం చేస్తున్నారు. మేజర్ పంచాయతీలకు దీటుగా జనరల్ రిజర్వ్ అయిన మైనర్ గ్రామ పంచాయతీల్లోనూ పోటాపోటీగా ఖర్చు చేసేందుకు ఆశావహులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్ పదవి కీలకం కావడం, నిధులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఖర్చు చేయనుండడంతో పోటీకి సై అంటున్నారు. ఒకవేళ సర్పంచ్‌గా ఓడిపోయినా.. ఆ సెంటిమెంట్‌తో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ఓ పదవి దక్కుతుందని ఆశపడుతూ ముందుకు సాగుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. తొలివిడత ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ విడతలో కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారాం, మంథని మండలాల పరిధిలోని 99 గ్రామ పంచాయతీల్లో గల 99 సర్పంచ్, 896 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.. నవంబర్ 29వ తేదీ వరకు పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలివిడత ఎన్నికల నిర్వహణకు, పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు.
ఖర్చులకు పైసలెట్లా?


