వామ్మో చలి!
కరీంనగర్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం చాలామంది చలిమంటలు కాగుతూ కనిపించారు. చలికాలం ప్రారంభం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయని, చలి కారణంగా జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సిటీలోని ప్రముఖ పల్మనాలజిస్టు రవీంద్రచారి తెలిపారు. శ్వాస, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వివరించారు. శరీర రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉండటంతో చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రిపూట బయటకు వెళ్లాళ్లివస్తే ఉన్నిదుస్తులు, సాక్స్, గ్లౌజ్, క్యాప్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రోజూ 2 లీటర్లకు పైగా వేడినీరు, సూప్‌లు, రాగి, పప్పులు, పండ్లు, కూరగాయలు తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చలిలో రక్తనాళాలు కుంచించుకుని రక్తం సరఫరా తగ్గిపోవడంతో గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని వివరించారు. ఛాతినొప్పి, అలసట, చెమటలు వంటి లక్షణాలు కనబడితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలన్నారు.


