అభివృద్ధి పనులే ఎజెండా
కరీంనగర్ అర్బన్: పార్టీలకతీతంగా అర్బన్ బ్యాంకును అగ్రగామిగా నిలపడమే తమ ముందున్న కర్తవ్యమని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులే తమ ఎజెండాగా ముందుకు సాగుతామని, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక చర్యలుంటాయని వివరించారు. సోమవారం తన ప్యానెల్‌తో అర్బన్ బ్యాంకు చేరగా.. చైర్మన్‌గా రాజశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టగా.. వివిధ పార్టీల నేతలు సన్మానించారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్‌ను అన్ని రంగాల్లో పటిష్టంగా నిలదొక్కుకునేలా పక్కా కార్యాచరణ చేపడతామని అన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తామని వెల్లడించారు. వ్యాపార రంగంలోని ప్రముఖులు బ్యాంకులో డిపాజిట్లు చేసేలా ప్రొత్సహిస్తామని, రూ.200కోట్లు లక్ష్యమని అన్నారు. జమ్మికుంట, హుస్నాబాద్ ప్రాంతాల్లో అర్బన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. డైరెక్టర్లు బొమ్మరాతి సాయికృష్ణ, దేశ వేదాద్రి, కన్న సాయి, బాశెట్టి కిషన్, బండి ప్రశాంత్‌దీపక్, తాడ వీరారెడ్డి, వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత, సరిళ్ల రతన్‌రాజు పాల్గొన్నారు.
వారం రోజుల్లో వైస్ చైర్మన్ ఎన్నిక
పాలకవర్గం ఎన్నిక సోమవారం జరగగా.. చైర్మన్ స్థానానికి ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో రాజశేఖర్‌ను చైర్మన్‌గా ప్రకటించారు. రాజశేఖర్ ప్యానెల్‌లో తనతో 10 మంది డైరెక్టర్లుండగా.. పోటీ లేకుండా పోయింది. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ ఉండడంతో ఎన్నిక జరగలేదు. వరాల జ్యోతి, శ్వేత, దేశ వేదాద్రి పోటీ పడుతుండడంతో.. వారం రో జు ల్లో ఎన్నిక ఉంటుందని అధికారులు వివరించారు.


