వరి విత్తనం సిద్ధం
● కొత్త వంగడాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు
● వానాకాలంలో సాగు చేసిన రైతులు
కరీంనగర్‌రూరల్: యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసేందుకు అవసరమైన విత్తనం సిద్ధమవుతోంది. ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలుతో రైతులకు ఆర్థికంగా భారమవుతుండటంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫౌండేషన్ విత్తనం తయారీ చేస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్ మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 20 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఒక్కో గ్రామంలో ఎంపిక చేసిన ఇద్దరు రైతులకు సాగు చేసేందుకు నాణ్యమైన వరి విత్తనాలు అందజేశారు. ఒక్కో విత్తన బస్తాతో ఎకరం చొప్పున మొత్తం 40 ఎకరాల్లో సాగు చేశారు.
దొడ్డు రకం విత్తనాలు పంపిణీ
వరిలో జేజీఎల్ 24423 దొడ్డురకం విత్తనాలను కరీంనగర్ పరిశోధన స్థానం నుంచి రైతులకు పంపిణీ చేశారు. కొన్ని వరి విత్తన పంటలు ప్రస్తుతం కోత దశలో ఉండగా మరికొన్ని గ్రామాల్లో కోతలు పూర్తి చేశారు. వారం రోజుల క్రితం కొత్తపల్లి మండలంలో శాస్త్రవేత్తలు పంటపొలాలను సందర్శించారు. తాము సరఫరా చేసిన విత్తనాలతో పండించిన పంట నుంచి గింజలను తీసుకుని రైతులు తిరిగి విత్తనంగా వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. పొలంలో కల్తీ కర్రలు, బెరుకులను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకుని కొన్ని సీజన్ల వరకు విత్తనంగా వాడుకునే అవకాశముంది. గ్రామంలోని ఇతర రైతులకు ఈ విత్తనాలను విక్రయించవచ్చు. రైతులు పండించిన విత్తనాలను 3నుంచి 4 వారాల పాటు నిల్వ చేసిన అనంతరం విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులకు ఎకరానికి రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు ఖర్ఛవుతోంది. ఈ విత్తనమైతే సగం ఖర్చు మాత్రమే అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు
కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన వర్సిటీ వీసీ రాజిరెడ్డి
కాల్వశ్రీరాంపూర్: శాసీ్త్రయ పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ దండ రాజిరెడ్డి సూచించారు. వాణిజ్య పంటలతోపాటు పండ్ల తోటలు, కూరగాయలు, సిరి ధాన్యాలు, పప్పు దినుసుల సాగుపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం రైతువేదికలో ఆయన సోమవారం రైతులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కొయ్యకాళ్లు, వ్యర్థాలు కాల్చడం ద్వారా కాలుష్యం పెరుగుతుందన్నారు. వ్యర్థాలను వర్మీకంపోస్టుగా తయారు చేసేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. కృషి విజ్ఞానకేంద్రం రామగిరి ఖిల్లా ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాతస్రవేత్త సతీశ్‌చంద్ర, ఉద్యానవన రిజిస్ట్రార్ భగవాన్, వర్సిటీ డైరెక్టర్ సురేశ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వరి విత్తనం సిద్ధం


