పెన్షన్ డబ్బుల కోసం తల్లిని వేధించిన కొడుకు
● న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వృద్ధురాలు
హుజూరాబాద్‌రూరల్: పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన అజ్మత్ బి(వృద్ధురాలు) తన కొడుకు నుంచి నిత్యం వేధింపులు ఎదుర్కొంటూ న్యాయం కోసం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. మరణించిన తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అజ్మత్ బికి కుటుంబ పెన్షన్ వస్తోంది. ప్రస్తుతం ఆమె ఈ పెన్షన్ డబ్బులతోనే తన కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతూ జీవనం సాగిస్తోంది. ఆమె కొడుకు అజిత్‌ఖాన్ ఆ పెన్షన్ డబ్బులను ఆశించి ప్రతిరోజూ వేధిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మందులకు కూడా డబ్బులు లేకుండా ప్రతిరోజూ తాగి వచ్చి పెన్షన్ డబ్బులివ్వాలని వేధిస్తున్నాడని వృద్ధురాలు కన్నీరుమున్నీరైంది. ఈ వేధింపులు భరించలేకే పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


