సైబర్ నేరగాళ్ల మోసం
● రూ.87వేలు కాజేసిన వైనం
జగిత్యాలక్రైం: విదేశాల్లో ఉన్న భారతీయులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన బద్రి రాకేశ్ జీవనోపాధి కోసం 10 రోజుల క్రితం ఇరాక్ వెళ్లాడు. ఇటీవల యూట్యూబర్ హర్షసాయి పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్ సృష్టించి రాకేశ్‌తో పరిచయం పెంచుకున్నారు. హర్షసాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డును పంపించి నీ అప్పులు తీర్చడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని నమ్మించారు. సైబర్ నేరగాళ్లు రాకేశ్‌కు రూ.6.50లక్షలు పంపినట్లు నకిలి స్క్రీన్ షాట్లు పంపి.. ఆ డబ్బులు విడుదల చేయాలంటే టాక్స్ చెల్లించాలని నమ్మించారు. రాకేశ్ గుడ్డిగా నమ్మి స్వగ్రామంలోని తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోంచి విడతలవారీగా రూ.87వేలు ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా పంపించాడు. సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ చెల్లించకుంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామని, కఠిన శిక్ష పడుతుందని భయబ్రాంతులకు గురి చేస్తూ వీడియోలు పంపారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మీడియాకు సమాచారమందించాడు.


