చోరీల తీరే వేరు..
కరీంనగర్‌క్రైం: దొంగతనం కేసుల్లో నిందితులు రూటు మార్చి కొత్త పద్ధతుల్లో చోరీలు చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో ఇళ్లలోకి దూరి ప్రత్యక్షంగా దాడులు చేయడం, బీరువాలు పగలగొట్టి దొంగతనాలు చేసిన సందర్భాలనేకం చూశాం. కానీ ప్రస్తుతమున్న టెక్నాలజీని వాడుకొని కొన్ని దొంగతనాలు జరుగుతుండగా.. తెలిసిన వారిపై మత్తు ప్రయోగం చేసి మరికొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు సైతం వారికి దీటుగా కేసులను దర్యాప్తు చేస్తూ సకాలంలో దొంగలను పట్టుకుంటున్నారు. సాంకేతికతను ఉపయోగించి దొంగలు పన్నిన పన్నాగాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసి నిందితులను కటకటాల్లోకి పంపిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో దొంగతనాలు జరిగినా.. చివరికి పోలీసులకు చిక్కడం తప్పదనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వైరెటీ పద్ధతుల్లో..
గతంలో తిమ్మాపూర్‌లో జరిగిన ఒక దొంగతనంలో నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన నిందితుడు తన భార్యకు ఒక ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి వస్తాడు. ఖాళీ సమయాల్లో రెక్కీ నిర్వహించి ఇక్కడ వివిధ ప్రాంతాలు, గ్రామాలు చుట్టి వచ్చాడు. ఇక్కడి ప్రాంతాల్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. 2 నెలల తర్వాత కరీంనగర్ జిల్లాపై కన్నేసి గన్నేరువరం, చిగురుమామిడి, తిమ్మాపూర్ ప్రాంతంలో తిరుగుతూ పొద్దంతా ఖాళీగా ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి లొకేషన్ పంపించుకొని వరుసగా రాత్రి వచ్చి ఇళ్లలో చోరీ చేసేశాడు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ.లక్ష స్వాధీనం చేసుకొని అతడిని జైలుకు తరలించారు. ఇతడు నిజామాబాద్ జిల్లాలో కూడా పలు దొంగతనాలు ఇదేవిధంగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తు ప్రయోగం చేసి బంగారం మాయం చేసిన ఘటన గంగాధర పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతుల ఇంటి సమీపంలోనే ఉంటూ వాళ్లకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ వారి వద్ద ఉన్న బంగారం దొంగతనం చేయాలనుకున్నాడు. నేరుగా దొంగిలిస్తే పోలీసులకు దొరికిపోయే అవకాశముంటుందని మత్తు ప్రయోగం చేయాలనుకున్నాడు. జ్వరం, తలనొప్పి, జలుబు, కాళ్ల నొప్పులున్నాయని అతడితో వారు చెప్పగా.. గతంలో ముంబాయి ప్రాంతంలో కళ్లలో కలిపే మత్తు టాబ్లెట్లు వారికి ఎక్కువ మోతాదులో ఇచ్చాడు. కొంత సమయానికి ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత బంగారం దొంగిలించాడు. దర్యాప్తు ప్రారంభించిన గంగాధర పోలీసులు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటనలో మత్తు ప్రయోగంతో ఇద్దరు వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోతారు.
జల్సాల కోసమే చోరీలు
ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే 90 శాతం వరకు దొంగతనాల్లో యువత పాత్ర ఉంటోంది. ఇందులో చాలావరకు మద్యం, గంజాయి, ఇతర జల్సాలు చేయడానికి అలవాటు పడ్డవారే. మరికొన్ని ఘటనల్లో ఆన్‌లైన్ రమ్మీ, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ అప్పులపాలయినవారు, బెట్టింగులకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకున్నవారున్నారు. ఈజీ మనీ కోసం విలాసవంతమైన జీవితాన్ని కావాలనుకునే యువకులు ఎక్కువగా ఇలాంటి దొంగతనాల బాట పడుతున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
మత్తు టాబ్లెట్ల ప్రయోగం..
టెక్నాలజీ వినియోగం
ఖాళీ ఇళ్లే టార్గెట్.. పగలు లోకేషన్ చూసుకొని రాత్రి చోరీలు
దొంగతనాలకు కొత్త పద్ధతులు.. కటకటాల్లోకి నిందితులు
టెక్నాలజీతో పట్టుకుంటున్న పోలీసులు


