ఢీకొని.. ఆపై ఈడ్చుకెళ్లి..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఓ వ్యక్తిని ఢీకొన్న కారు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలవ్వగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి రామంచ సురేందర్(45) గ్రామంలో పని చేసి ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు ఢీకొంది. కొద్ది దూరం కారు సురేందర్‌ను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. రాత్రి కావడంతో మొదట ప్రమాదం ఎలా జరిగిందో తెలియలేదు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పరిశీలించి కారు ఢీకొన్నట్లు గుర్తించారు. మీర్జంపేట గ్రామ వాసి ఎండీ హాబ్బీర్‌కు చెందిన టీఎస్22టీఏ3277 అనే నంబరు కారు ఢీకొని కొంత దూరం ఈడ్చుకెల్లినట్లు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. సురేందర్‌తో భార్య విడాకులు తీసుకొని కుమార్తెతో వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సురేందర్ తండ్రి రాజయ్య మృతిచెందగా.. తల్లి సుగుణ సురేందర్ బాగోగులు చూస్తోంది.
కారు ప్రమాదంలో తాపీమేసీ్త్రకి తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి


