గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు..
పాలకుర్తి: బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల రైల్వే గేట్ సమీపంలో ఫోర్‌లైన్ రహదారిపై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో సోయం శ్రీధర్(35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. హుస్నాబాద్ మండల పరిధిలోని కుచనపల్లి గ్రామానికి చెందిన సోయం శ్రీధర్ గ్రామంలో తాపీమేసీ్త్రగా పని చేస్తున్నాడు. అతడికి భార్య రమ, కుమారుడు బిందు(4) ఉన్నారు. ఎన్టీపీసీలోని బంధువుల ఇంటికి తన కుమారుడు బిందుతో కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. సాయంత్రం ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కన్నాల బస్టాండ్ సమీపంలో స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి వెళ్లే రైల్వేలైన్ దాటిన తర్వాత శ్రీధర్ బైక్‌ను వెనకాల నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. శ్రీధర్ రహదారికి కుడివైపున ఎగిరిపడగా.. అతడి తలభాగం పైనుంచి వాహన టైర్లు వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి మృతిచెందాడు. బైక్‌పై ముందుభాగంలో కూర్చున్న శ్రీధర్ కొడుకు బిందుకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎస్సై నూతి శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా అంబులెన్స్ సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి బిందు ఏం జరిగిందో తెలియక బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తుండగా.. స్థానికులు అతన్ని అక్కున చేర్చుకున్నారు. పోలీస్ వాహనంలో పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు.


