రాష్ట్రంలో రాజకీయ శూన్యత
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా జిల్లాకేంద్రంలో శనివారం పర్యటించారు. వీపార్క్‌లో వివిధ వర్గాల వారితో, టీఎన్జీవో భవన్‌లో కళాకారులతో సమావేశమయ్యా రు. టవర్‌సర్కిల్‌లో ఫిలిగ్రీ కళాకారుల పనులను పరిశీలించారు. వీపార్క్ హోటల్‌లో మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయినవారిని ప్రభుత్వం, ప్రతిపక్షం పట్టించుకోవడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సీఎం కేటాయించినా, విడుదల సక్రమంగా జరగడం లేదన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు. వెల్ఫేర్ హాస్టల్స్‌లో జరిగే ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో 110మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. తమకు హడావుడిగా రా జకీయ ప్రకటనలు చేసే ఉద్దేశం లేదన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అధ్వానంగా ఉందని, రూ.వెయ్యికోట్లు కేటాయించినా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు. గ్రానైట్ మాఫియాతో పర్యావరణం దెబ్బతింటోందని, ప్రభుత్వ అనుమతులకన్నా ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నాయన్నారు.


