వరద సులువుగా వెళ్లేలా చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: వరద ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల చౌరస్తాలో వర్షం, డ్రైనేజీనీళ్లు సులువుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. మంచిర్యాల చౌరస్తాలో డ్రైనేజీల గుండా వరదనీళ్లు వెళ్లకుండా, తరచూ రోడ్డెక్కుతుండడం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షంతో కూడా చౌరస్తా పూర్తిగా జలమయమైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు పనులు మొదలు పెట్టారు. శనివారం పనులను పరిశీలించిన కమిషనర్ పలు సూచనలు చేశారు. వరద డ్రైనేజీల గుండా సులువుగా వెళ్లేందుకు, రోడ్డుపైకి వరదనీళ్లు చేరకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలపై దుకాణదారులు సొంతంగా వేసుకొన్న శ్లాబ్‌లు తొలగించాలని ఆదేశించారు.


