డివిజన్ల పంచాయితీ మొదటికి!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డివిజన్ల పునర్విభజన పంచాయితీ మళ్లీ మొదలైంది. అశాసీ్త్రయంగా పునర్విభజన చేశారంటూ సామాజిక కార్యకర్త మహమ్మద్ అమీర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అదే బాటలో మరికొంతమంది నాయకులు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నం చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో అప్పట్లో డివిజన్ల పునర్విభజనలో కీలకంగా ఉన్న నగరపాలకసంస్థ అధికారుల్లో గుబులు మొదలైంది.
గీసిందే... రాసుడు
60 డివిజన్లతో ఉన్న కరీంనగర్, ఆరు గ్రామాలు, ఒక మున్సిపాలిటీ విలీనంతో 66 డివిజన్లుగా మారడం తెలిసిందే. దీంతో గత జూన్‌లో 66 డివిజన్లను పునర్విభజించారు. కొంతమంది మాజీ కార్పొరేటర్లు, రాజకీయ నాయకులకు లబ్ధిచేకూర్చే విధంగా డివిజన్లు పునర్విభజించారంటూ అప్పట్లోనే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. డివిజన్ల పునర్విభజనలో కీలకంగా వ్యవహరించిన పట్టణ ప్రణాళిక అధికారుల్లో ఒకరిద్దరు సదరు నాయకులతో కుమ్మక్కయ్యారనే ప్రచారం ఉంది. తమకు అనుకూలంగా ఉన్న కాలనీలు, ఇళ్లను ఒకే డివిజన్‌లో చేర్చేందుకు సదరు అధికారులను మచ్చిక చేసుకోవడం, ఆ అధికారులు కూడా ఆ విధంగా మార్చిన ఉదంతాలు చోటుచేసుకొన్నాయి. కొంతమంది మాజీ కార్పొరేటర్లు, నాయకుల ఇళ్లలో కూర్చొని డివిజన్ల హద్దులు నిర్ణయించినట్లు పలువురు ఆశావహులు ఆరోపించారు కూడా. డివిజన్ మ్యాప్‌ను ముందు పెట్టుకొని తమ డివిజన్ ఏ విధంగా ఉండాలో నాయకులు మ్యాప్‌పై గీసిన వాటినే సదరు అధికారులు రాసినట్లుగా అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఏం చేసేది లేకపోవడంతో ఆశావహులంతా మిన్నకుండిపోయారు. అధికారులు కూడా అంతా సక్రమంగానే చేశామంటూ ప్రకటనలు చేసి చేతులు దులుపుకొన్నారు.
కోర్టుకు వెళ్దామా?
డివిజన్ల పునర్విభజన సందర్భంగా రహదారులను, భౌగోళిక పరిస్థితులను కూడా చూడాలని మార్గదర్శకాలు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో రోడ్డు దాటి ఇండ్లను తీసుకోవడం, ఎంపిక చేసిన ఇళ్లను మాత్రమే తమ డివిజన్లలో కలపడం జరిగింది. కళ్ల ముందు అక్రమ పునర్విభజన కనిపిస్తున్నా, అధికారుల తీరుతో ఏమీ చేయకుండా పోయారు. ఇప్పుడు హైకోర్టు విచారణకు స్వీకరించడంతో, బాధిత నాయకులు కూడా అదే బాట పట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. తాము కూడా కోర్టుకు వెళితే ఎలా ఉంటుందని న్యాయసలహాలు తీసుకుంటున్నారు. ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఉందా అనేది చర్చిస్తున్నామని, కోర్టుకు వెళ్తేనే న్యాయం జరిగే అవకాశం ఉందంటూ ఓ మాజీ కార్పొరేటర్ వ్యాఖ్యానించారు. గెజిట్ వచ్చాక ఎలాంటి మార్పు ఉండదని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు.
అధికారుల్లో గుబులు
కొంతమంది మాజీ కార్పొరేటర్లు, నాయకుల కోసం మార్గదర్శకాలను ప్రక్కనపెట్టి డివిజన్లను మార్చిన అధికారుల్లో గుబులు మొదలైంది. అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా, డీలిమిటేషన్ పూర్తయి, గెజిట్ కూడా రావడంతో ఆ అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా హైకోర్టులో విచారణకు రావడం, మరికొంతమంది అదే బాటలో వెళ్లే అవకాశం ఉండడంతో సదరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కోర్టు ఆదేశాలతో లోతుగా వెళితే తమ చేతివాటం బయటపడేందుకు చాలా ఘటనలు ఉన్నాయంటూ, తమ పరిస్థితి ఏమిటోనంటూ సహచర అధికారుల వద్ద వాపోతున్నారు. ఏదేమైనా ముగిసిందనుకున్న పునర్విభజన పంచాయితీ, మళ్లీ కోర్టు రూపంలో మొదలవడం తీవ్ర సంచలనంగా మారింది.


