అనధికార బోర్డులు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: అనధికార హోర్డింగ్‌లు, బోర్డులపై నగరపాలకసంస్థ చర్యలకు పూనుకుంది. శుక్రవారం నాటికి నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 220 హోర్డింగ్స్, బోర్డులను తొలగించింది. నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ప్రచార హోర్డింగ్స్, బోర్డుల నియంత్రణపై నగరపాలకసంస్థ దృష్టి సారించింది. ఇందులో ఎక్కువగా అనుమతి లేనివే కావడంతో,వాటిపై చర్యలు తీసుకొంది. నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనుమతి లేకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా, ప్రధాన రహదారులు,కూడళ్లు, ఫుట్‌పాత్‌లకు అడ్డుగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తొలగించారు.
అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే జరిమానా
నగరపాలకసంస్థ అనుమతి లేకుండా నగరంలో ఫుట్‌పాత్‌లు, జంక్షన్లు, రహదారులు, ఇతర ప్రజా ప్రదేశాల్లో ప్రచార హోర్డింగ్స్, బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు. సంబంధిత వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రచార నియంత్రణ చట్టం,మున్సిపల్ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగర స్వచ్ఛత, శుభ్రత, సిటీ బ్యూటిఫికేషన్‌ను కాపాడడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.


