వైద్య ఖర్చులకు రూ.1.61లక్షలు సాయం
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. మరోవైపు వైద్య ఖర్చులకు ఇబ్బంది. ఇలాంటి తరుణంలో ఆ కుటుంబానికి తామున్నామని ముందుకొచ్చారు ఫేస్‌బుక్ మిత్రులు. బాధిత కుటుంబానికి రూ.1.61 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధ దంపతుల కుమారుడు (3) కొద్ది నెలలుగా బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులకు చూపించగా సర్జరీ కోసం సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభాకర్ చిరుద్యోగి. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. తనకున్న స్థలాన్ని అమ్మితే రూ.10లక్షలు సమకూరుతాయి. మరో రూ.10 లక్షల కోసం దాతలను సాయం కోరుతున్నాడు. బాలుడి సమస్యను తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి ఈనెల 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సాయం కోరాడు. ఎన్నారైలు, వివిధ ప్రాంతాల దాతలు ఆ పోస్టుకు స్పందించి బాలుడి తల్లి అనురాధ బ్యాంకు ఖాతాకు రూ.1.61 లక్షలు విరాళాలుగా పంపించారు. వాటిలో వైద్య పరీక్షల కోసం రూ.40వేలను జగిత్యాల సీఐ కరుణాకర్, ఎస్సై రవికిరణ్ చేతులమీదుగా పంపిణీ చేయించారు. మిగిలిన విరాళాలను తదుపరి వైద్యం కోసం బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచారు. సర్జరీకి లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుండగా.. ప్రభుత్వం సాయం అందించాలని రమేశ్‌తోపాటు బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఫేస్‌బుక్ మిత్రుల ఔదార్యం


