తడిసిన ధాన్యం తూకం వేయండి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
సైదాపూర్: తడిసిన ధాన్యం మిల్లర్లు కొనేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సైదాపూర్ శివారులో కల్వర్టుపై వరద ఉధృతిని పరిశీలించారు. హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సైదాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వెన్కెపల్లి తుమ్మలచెరువు కట్టుకాలువ తెగడంతో సైదాపూర్ న్యాల చెరువుకు పెరిగి వడ్లు కొట్టుకుపోయాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్, చిన్నముల్కనూర్, ఇందుర్తి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఇందుర్తి– కోహెడ మధ్య హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, సీపీ గౌస్‌ఆలం పాల్గొన్నారు.
పంట నష్టంపై కేంద్రమంత్రి సంజయ్ ఆరా
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వర్షాలతో పంటలు, ఆస్తులకు జరిగిన నష్టంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ఆరా తీశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ఇండ్లల్లోకి వరదనీళ్లు చేరడం, ప్రతి వర్షాకాలం ఇదే సమస్య తలెత్తుతుండడంతో, డివిజన్ బీజేపీ ఇన్‌చార్జి తోట సాగర్ సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సంజయ్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా స మాచారం ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో వరద నీళ్లు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన కెడికె తారవ్వకు మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీనుంచి ఫోన్ చేశారు. పంట నష్టం వివరాలన తెలుసుకున్నారు. తక్షణ సా యంగా రూ.50 వేలు పంపిస్తున్నట్లు తెలిపా రు. హుస్నాబాద్ బీజేపీ నేత కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ద్వారా రూ.50వేలను అందించే ఏర్పాట్లు చేశారు.
తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లుకు పంపండి
కరీంనగర్ అర్బన్: భారీ వర్షాలతో ఏర్పడిన నష్టంపై పక్కాగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పంట, ఆస్తి నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. జిల్లాలో వర్షాలతో 8 పశువులు మరణించాయని, వాటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు. పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం అందజేయాలన్నారు. జిల్లాలో 2,036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లుగా సమాచారం ఉందని, రైతు వారీగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు.


