 
															అయ్యో పాపం.. ఎంతటి దయనీయం
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న కుటుంబం రోడ్డున పడింది. కన్నకొడుకు శవాన్ని సైతం అద్దె ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితిలో పోస్టుమార్టమ్ గది నుంచే శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన సిరిసిల్లలో గురువారం చర్చనీయమైంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన గౌడ శారద, నారాయణ దంపతులకు ముగ్గురు కొడుకులు మహేశ్, ప్రకాశ్, విశాల్. నారాయణ నేతకార్మికుడిగా భీవండి వెళ్లి పనిచేశాడు. భార్య శారద బీడీలు చేసేది. భీవండి నుంచి వచ్చిన నారాయణ చంద్రంపేటలో ఓ ఇంటిని కొనుగోలు చేసి కార్మికుడిగా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో నారాయణ 20 ఏళ్ల క్రితం ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అదే సమయంలో ఇల్లు కూడా కొంతమేరకు కాలిపోయింది. కొద్ది రోజులకే ఆర్థిక ఇబ్బందులతో ఆ ఇంటిని అమ్మేసి సిరిసిల్లలో అద్దెకుంటున్నారు.
రెండేళ్ల కిందట పెద్ద కొడుకు..
జిల్లా కేంద్రంలోని శివనగర్‌లో అద్దెకుంటూ ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల క్రితం పెద్ద కొడుకు గౌడ మహేశ్ ఉరివేసుకుని మరణించాడు. ఇద్దరు కొడుకులతో హోటల్ నిర్వహిస్తూ అద్దె ఇంట్లో నెట్టుకొస్తున్నారు. బోటాబోటీ ఆదాయంతో సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విశాల్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ వైద్యంపై ఆధారపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో విసిగిపోయిన విశాల్ సోమవారం గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం చనిపోయాడు. విశాల్‌కు సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
‘గూడు’ లేని గోడు
విశాల్ శవాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి.. చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితిలో చేసేదేమి లేక ఆ తల్లి తన కొడుకు శవాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచే నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లింది. పెళ్లి కాని కొడుకు విశాల్ మృతదేహానికి సాంప్రదాయం ప్రకారం జిల్లేడు చెట్టుతో అప్పటికప్పుడు పెళ్లిచేసి.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పగవాడికి సైతం ఇలాంటి కష్టాలు రావద్దని చర్చించుకున్నారు.
కన్న కొడుకు బలవన్మరణం
పోస్టుమార్టం గది నుంచే శ్మశాన వాటికకు..
సొంతిల్లు లేని దైన్యం
సిరిసిల్లలో రోడ్డున పడ్డ నేతన్న కుటుంబం
 
							అయ్యో పాపం.. ఎంతటి దయనీయం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
