ధాన్యం మొలకెత్తింది
కరీంనగర్‌రూరల్: మోంథా తుఫాన్‌తో కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోగా కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఎకరాల్లో వరి కోసి ధాన్యం తీసుకొచ్చాను. రెండురోజుల క్రితం కురిసిన వానకు ధాన్య మంతా తడిసిపోగా బుధవారం కురిసిన భారీ వర్షానికి గింజలు మొలకెత్తాయి. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.
– దాసరి మల్లయ్య, రైతు, తీగలగుట్టపల్లి
హుజూరాబాద్‌రూరల్: నాలుగు ఎకరాల్లో సన్నరకం వరి పండించారు. వానలకు పంటపూర్తిగా కొట్టుకుపోయింది. కేవలం ఐదు బస్తాల వడ్లు మాత్రమే మిగిలాయి. అవి కూడా నీటిలోనే ఉండటంతో వాటిని ఎత్తే ప్రయత్నం చేసినా దక్కే పరిస్థితి లేదు. దాదాపు రూ.1.25లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఈ మొత్తాన్ని అప్పుగా తెచ్చాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
– మునిగాల పోచయ్య,
కౌలురైతు, జూపాక, హుజూరాబాద్
నేను 15 ఎకరాల్లో సన్నవడ్ల రకం పంట నాటు వేశాను. ఇప్పుడిప్పుడే గింజ పాలు పోసుకునే దశలో ఉంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పాటుగా భారీగా గాలి రావడంతో పూర్తిగా నేలమట్టమయింది. దీనితో ఒక్క గింజ కూడా చేతికందలేని పరిస్థితి ఏర్పడినది. రూ.5లక్షల మేర పెట్టుబడులయ్యాయి. కనీసం రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి. – గంట్ల రవీందర్ రెడ్డి,
దత్తోజుపల్లి, రామడుగు
కొత్తపల్లి(కరీంనగర్): మోంథా తుపాను ప్రభావంతో టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో రూ.10లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలి పారు. వర్షం కారణంగా 11 కేవీ లైన్లు, ఎల్‌టీ స్తంభాలు, 25 విద్యుత్ స్తంభాలు, 17 డీటీఆర్‌లు దెబ్బతిన్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం మొలకెత్తింది
ధాన్యం మొలకెత్తింది


