సర్కారుకే శఠగోపం! | - | Sakshi
Sakshi News home page

సర్కారుకే శఠగోపం!

Oct 30 2025 9:16 AM | Updated on Oct 30 2025 9:16 AM

సర్కారుకే శఠగోపం!

సర్కారుకే శఠగోపం!

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికే శఠగోపం పెట్టారు. ప్రభుత్వ సొమ్ముతో దర్జాగా దందా చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడం విడ్డూరం. ఏకంగా 34వేల క్వింటాళ్లు మాయం చేయడం హట్‌టాపిక్‌గా మారింది. మరి ఇన్నాళ్లు పౌరసరఫరాలశాఖ పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా మిల్లులను పరిశీలిస్తే ఇలాంటివెన్నో వెలుగుచూస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేసిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులే ఖంగుతినగా వేల క్వింటాళ్ల మాయంలో ఎవరి పాత్ర ఎంతన్నది తేలాల్సి ఉంది. జమ్మికుంటకు చెందిన సప్తగిరి ఇండస్ట్రీస్‌లో భారీ మోసం వెలుగుచూడగా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

మరాడించి ఇవ్వమంటే మాయం

యాసంగి సీజన్‌కు ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయగా, మరాడించి ఇవ్వాలని 40వేల క్వింటాళ్లకు పైగా ధాన్యమిచ్చింది. సీఎంఆర్‌ కింద బియ్యం ఇవ్వాల్సి ఉండగా వివిధ కారణాలను బూచిగా చూపుతూ తప్పించుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. మిల్లులో 34,169 క్వింటాళ్ల ధాన్యం మాయం చేశారని తేలింది. బ్యాలెన్స్‌ ధాన్యం కూడా లేదని స్పష్టమైంది. ధాన్యం క్వింటాల్‌కు రూ.2000లకు లెక్కకట్టిన రూ.6కోట్లకు పైమాటే. కాగా సదరు ధాన్యంతో మిల్లరు వ్యాపారం చేయడం క్షేత్రస్థాయి అధికారుల డొల్లతనాన్ని చాటుతోంది. ఎ రిజిష్టర్‌ నిర్వహణలో లోపాలు, మీటర్‌ రీడింగ్‌ అంతంతమాత్రమే కావడం సివిల్‌ సప్లయ్‌ అధికారుల మామూలు మంత్రమే అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ధా న్యం మరాడించారా.. మరాడించకుండానే మార్కెట్‌కు తరలించారా..? అన్నది అంతుచిక్కని ప్రశ్న.

బియ్యం రాబడుతారా..?

సప్తగిరి ఇండస్ట్రీస్‌ మిల్లులో వెలుగుచూసిన అక్రమంపై జిల్లా పౌరసరఫరాలశాఖ తీవ్రంగా పరిగణించింది. సదరు మిల్లును బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. వానాకాలం ధాన్యాన్ని ఇవ్వరాదని నిర్ణయించారు. ఇచ్చిన ధాన్యాన్ని ఎటు తరలించారన్నది తేల్చుతారా అన్నది ప్రశ్నార్థకం. గతంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూడగా పూర్తిస్థాయి విచారణ లేకుండానే చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. అసలా బియ్యం ఎటెల్లాయి.. ఎవరు కోనుగోలు చేశారు, ఎవరి పాత్ర ఎంత, అధికార యంత్రాంగంలోని సహకారం వంటి కోణాల్లో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయని సమాచారం.

సీఎంఆర్‌.. పెట్టుబడి లేని ఆదాయం

ధాన్యం ఉత్పత్తిలో కరీంనగర్‌ పాత్ర కీలకం. జిల్లాలో 150కి పైగా రైస్‌మిల్లులుండగా ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఎసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేసిన ధాఽన్యాన్ని సీఎంఆర్‌ కింద మిల్లులకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ అయితే క్వింటాల్‌కు 67కిలోలు, రారైస్‌కు 68కిలోలు తిరిగి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రూ.35ను పౌరసరఫరాలశాఖ చెల్లిస్తోంది. ఏటా ఈ ప్రక్రియ ఉంటుంది. కాగా హెచ్చు మిల్లర్లు సీఎంఆర్‌తో వ్యాపారం చేస్తున్నట్లు పౌరసరఫరాల విజిలెన్స్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పలుమార్లు వెల్లడైంది. సదరు సమయాల్లో సంఘం నేతలు పలుకుబడి ఉపయోగించి పైఅధికారులను బుజ్జగించి నామమాత్రపు కేసులతో బయటపడ్డారు. వానాకాలం, యాసంగి ధాన్యమైనా పలువురు మిల్లర్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ఇతర మార్గాల ద్వారా పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తే తప్పా సకాలంలో ఇచ్చిన దాఖలాలు తక్కువ.

కేసులైనా మార్పేది.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అంతేనా?

జిల్లా పరిధిలో 23మిల్లులు సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సిన వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వలేదు. సదరు మిల్లులపై పౌరసరఫరాల శాఖ గతంలోనే కేసులు నమోదు చేయించింది. వివిధ రకాల కేసులు పెట్టగా రాజకీయ, ధన ప్రవాహంతో నామమాత్రంగా వ్యవహరించారని స్పష్టమవుతోంది. కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా ఒక్క మిల్లరు బకాయి సీఎంఆర్‌ ఇవ్వకపోవడం పర్యవేక్షణ తీరుకు తార్కాణం. రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ప్రయోగిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా మిల్లర్లలో మార్పు లేదు. సదరు యాక్ట్‌ కింద మిల్లుల ఆస్తుల వేలం వేసైనా ఆ మొత్తం వసూలు చేయొచ్చు.

ప్రభుత్వమిచ్చిన ధాన్యమే మాయం

34 వేల క్వింటాళ్లు ఎటెల్లినట్లు?

సివిల్‌ సప్లయ్‌ నోటీసులకు జాన్తానై

ఎవరిపాత్ర ఎంత.. సూత్రధారులెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement