 
															రమ్మీ ఆడి.. దొంగగా మారి
కరీంనగర్‌రూరల్: ఆన్‌లైన్ రమ్మీ ఆడి అప్పుల పాలైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. ఒకే ఇంట్లో రెండుపర్యాయాలు దొంగతనానికి పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేసిన కరీంనగర్‌రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, రూ.12 లక్షల విలువైన బంగారం రికవరీ చేశారు. కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ విజయ్‌కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. తీగలగుట్టపల్లిలోని రెవెన్యూకాలనీకి చెందిన మహ్మద్ ముస్తాక్ కోదాడ సమీపంలోని మేళ్లచెరువు వద్ద బాయిలర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల నుంచి అన్‌లైన్ రమ్మీ ఆడుతూ రూ.లక్షల్లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. అప్పు తిరిగి చెల్లించలేక దొంగగా మారాడు. ఫిబ్రవరి, జూన్‌లో తీగలగుట్టపల్లిలోని ఒకేఇంట్లోకి చొరబడి బంగారం, నగదు దొంగతనం చేశాడు. జూబ్లీనగర్‌లోని ఓ ఇంట్లో టీవీ ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన బంగారాన్ని వరంగల్, మంచిర్యాల, కరీంనగర్‌లో విక్రయించాలనే ఉద్దేశంతో కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి పట్టుకున్నారు. 91గ్రాముల బంగారం, రూ.5వేలనగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముస్తాక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నిరంజన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాశ్‌గౌడ్, ఎస్సై లక్ష్మారెడ్డిని సీపీ గౌష్ అలం, ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు.
ఒకే ఇంట్లో పలుమార్లు చోరీ
పట్టుకున్న పోలీసులు
రూ.12లక్షల విలువైన బంగారం స్వాధీనం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
