దూది రైతు దగా! | - | Sakshi
Sakshi News home page

దూది రైతు దగా!

Oct 29 2025 7:31 AM | Updated on Oct 29 2025 7:31 AM

దూది

దూది రైతు దగా!

అయ్యో అన్నదాత ● మిల్లులు, మార్కెట్లలో అడ్డగోలు దోపిడీ ● మద్దతు ధరకు కొనేది తక్కువే ● వచ్చేదే అరకొర.. కొనుగోళ్లు జాప్యం

ఇదీ పరిస్థితి

మార్కెట్లలో, జిన్నింగ్‌ మిల్లుల్లో రైతులకు ఉపయోగపడే సమాచారమే ఉండటం లేదు. పత్తిని అమ్మితే తరుగు, హమాలీ, తదితర వివరాలేవీ ప్రదర్శించడం లేదు. డబ్బులు ఇచ్చేటపుడు తక్కువగా ఇస్తున్నారు.

– కనకయ్య, వన్నారం, రామడుగు

ఎకరంనర భూమిలో పత్తివేసిన. వచ్చిన మూడు బస్తాలను మార్కెట్‌కు తీసుకొస్తే కొంటలేరు. కనీస మద్దతు ధర ఇస్తున్నరా అంటే అదీ లేదు. క్వింటాల్‌కు రూ.6 వేలకు మించి పెడ్తలేరు. ఇట్లయితే బతుకుడు ఎట్ల?

– లావణ్య,గంగిపల్లి, మానకొండూరు

కరీంనగర్‌ అర్బన్‌: పత్తికి ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 కానీ కరీంనగర్‌ మార్కెట్లో మాత్రం రూ.5100ల నుంచి రూ.6200 మాత్రమే. అంటే మార్కెట్లలో దళారులే ఽఏలుతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ పోస్టుల లేమితో కునారిల్లుతుండగా కర్శకునికి భరోసా కరవవుతోంది. తమ శ్రమను కళ్లేదుటే దళారులు పిండేస్తుంటే కర్శకుని కడుపు తరుక్కుపోతోంది. మార్కెట్‌ అధికారుల పర్యవేక్షణే లేకపోవడంతో బతుకు జీవుడా..అంటూ అన్నదాతలు పంటను విక్రయిస్తున్నారు. కరీంనగర్‌, జమ్మికుంట, గంగాధర, గోపాల్‌రావుపేట, చొప్పదండి మార్కెట్లతో జిన్నింగ్‌ మిల్లులో ఇదే దుస్థితి. మార్కెట్‌ కార్యదర్శులతో పాటు కీలక పోస్టులన్నీ ఖాళీలే. ఎండనక, వాననక రైతులు పంటలు పండిస్తే తీరా దిగుబడి వచ్చాక వ్యాపారులు నోటికాడి ముద్దను లాగేస్తున్నారు.

వచ్చేదే అరకొర.. కొనుగోళ్లు స్లో..

మార్కెట్లతో పాటు జిన్నింగ్‌ మిల్లులకు వచ్చే పత్తి తక్కువే. కానీ... వ్యాపారుల ధరల నిర్ణయం తాపీగా జరుగుతోంది. గంటల తరబడి నిరీక్షించడం అన్నదాతవంతవుతోంది. ఉదయమే రైతులు మార్కెట్‌కు చేరుతుండగా వ్యాపారులు మధ్యాహ్నం దాటితే గానీ ఖరీదు చేయడం లేదు. అన్ని మార్కెట్లలో కలిపి నిత్యం 1500 క్వింటాళ్లకు మించి పత్తి రాకపోగా వచ్చిన అరకొర పత్తికే ఆలస్యం చేయడం వ్యాపారులకే చెల్లు. బస్తాలు కోయడం, చేతి స్పర్శతో నాణ్యత చెప్పడం ఆపై కూటమి కట్టిన వ్యాపారులు ధరలను నిర్ణయిస్తున్నారు. నీకిది నాకది అంటూ లోలోన కుమ్మౖక్కై మద్దతు ధరకు రూ.2500కు పైగా తక్కువగా ఖరీదు చేస్తున్నారు. నిత్యం 1500ల క్వింటాళ్లు వస్తుండగా ఈ లెక్కన రైతులు రూ.37.50 లక్షలు నష్టపోతున్నారు. అంటే మార్కెట్లలో, జిన్నింగ్‌ మిల్లులు కలిపి గుప్పెడు మంది లేని వ్యాపారులు ఒక్క రోజులోనే లక్షలు వెనకేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

జిన్నింగ్‌ మిల్లుల్లోనూ దోపిడీ

వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తులను విక్రయించే రైతులకు నాలుగేళ్లుగా భిన్న పరిస్థితి నెలకొన్నాయి. ఈ–నామ్‌ మార్కెట్‌ వరకే పరిమితమవగా సిండికెట్‌ దందా సాగుతోంది. ఇక పత్తి పంటను కేవలం జిన్నింగ్‌ మిల్లుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని మార్కెట్‌ అధికారులను ప్రశ్నిస్తే యార్డుకు రైతులు విడిపత్తి తేవడం లేదని, అటే తీసుకెళుతున్నారని మిల్లుల నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే కొనుగోళ్లు జరిగితే రైతులకు కోతలు లేకుండా లాభం చేకూరనుంది. ఒకవేళ ధర ఇష్టం లేకపోతే అక్కడే ధర వచ్చేవరకు ఉంచుకోవచ్చు. జిన్నింగ్‌ మిల్లులో ఆ పరిస్థితి లేదు. సేటు చెప్పిన రేటుకు అమ్ముకోవడమే లేదంటే తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఇష్టారీతిగా ధర పలుకుతూ రైతుల శ్రమను పిండేస్తున్నారు. అన్నదాత ఎండనక, వాననక నెలల తరబడి పంట ఉత్పత్తికి అపసోపాలు పడితే ఏసీ గదుల్లో ఉండే వ్యాపారులు సంపన్నులైపోతున్నారు.

కనీస మద్దతు ధర: రూ.8110

వ్యాపారులు చెల్లిస్తున్నది: రూ.5200–6500

నిత్యం మిల్లులు, మార్కెట్‌కు వస్తున్న పత్తి: 1500 క్వింటాళ్లు

రైతులకు జరుగుతున్న నష్టం:

రూ.37.50 లక్షలు

పత్తి కొనుగోళ్లు ప్రారంభం: పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా మార్కెటింగ్‌ ఽఅధికారి షాహబోద్దీన్‌ తెలిపారు. జిల్లాలో ఆరు జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు చేస్తోందని, కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకుని అమ్మకానికి తీసుకురావాలన్నారు. శక్తి మురుగన్‌ ఇండస్ట్రీస్‌(ఎలబోతారం), వైభవ్‌ కాటన్‌ కార్పొరేషన్‌(జమ్మికుంట), నరసింహ కాటన్‌ జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ (జమ్మికుంట), సరిత కాటన్‌ ఇండస్ట్రీస్‌(జమ్మికుంట), సీతారామ కాటన్‌ ఇండస్ట్రీస్‌(జమ్మికుంట), కావేరి జిన్నింగ్‌ మిల్లు (వెలిచాల)లో సీసీఐ కొనుగోలు చేస్తుందని వివరించారు. 8 శాతం తేమ మించకుండా చూసుకుని పత్తిని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

దూది రైతు దగా!1
1/3

దూది రైతు దగా!

దూది రైతు దగా!2
2/3

దూది రైతు దగా!

దూది రైతు దగా!3
3/3

దూది రైతు దగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement