దివ్యాంగులకు సేవలు అభినందనీయం
తిమ్మాపూర్: దివ్యాంగులకు విద్య, వృత్తిశిక్షణ అందిస్తూ ట్రస్ట్ దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలో మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తివిద్యా శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.26 లక్షల వ్యయంతో అందించిన బస్సును ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బస్సులో కొంతదూరం ప్రయాణించారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులున్నారని, 40 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. అదనంగా, వైద్య శిబిరాల నిర్వహణతో 136 మంది రోగులకు కంటి ఆపరేషన్లు చేయించామన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డీజీఎం సీహెచ్. వెంకటరెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ సభ్యులు బి.వెంకటయ్య పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి వైద్యసిబ్బందితో సమీ క్ష నిర్వహించారు. జిల్లావైద్యాధికారి వెంకటరమణ తదితరులున్నారు. అనంతరం ఎల్‌ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అలింకో సంస్థ సహకారంతో నిర్వహించిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు.
అడ్మిషన్లలో ఎస్‌ఆర్‌ఆర్ రాష్ట్రంలోనే టాప్
సప్తగిరికాలనీ(కరీంనగర్): అడ్మిషన్స్‌లో రాష్ట్రంలోనే ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీ టాప్‌లో ఉందని ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన అకాడెమీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి అటానమస్ డిగ్రీ బ్యాచ్ పరీక్షల ఫలితా లు ఉత్సాహకరంగా ఉన్నాయన్నారు. సమావేశ, అటానమస్ సమన్వయకర్త వంగల శ్రీని వాస్ విద్యా సంవత్సరంలో నిర్వహించిన పలు కార్యక్రమాలను వివరించారు. కళాశాల మాజీ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, శాతవాహ న వర్సిటీ ప్రొఫెసర్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్ పి.నితిన్, టి.రాజయ్య పాల్గొన్నారు.
తగ్గిన పత్తిధర
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తిధర తగ్గింది. సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,200 పలుకగా.. మంగళవారం రూ.200 తగ్గి క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ.7,000 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
అర్బన్ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా సహకార అధికారి సీహెచ్.మనోజ్ కుమార్ కోరారు. మంగళవారం కరీంనగర్ అర్బన్ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో అభ్యర్థులకు అవగాహన నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమావేశంలో సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి.శివనాగేందర్‌రెడ్డి, కె.వంశీకృష్ణ, ఎ.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సేవలు అభినందనీయం
దివ్యాంగులకు సేవలు అభినందనీయం


