‘బ్రెయిన్’ స్ట్రోక్ భయం!
ఇవీ స్ట్రోక్‌కు కారణాలు...
● అవగాహన ఉంటే స్ట్రోక్‌కు చెక్ ● గోల్డెన్ పీరియడ్‌పై అవగాహన అవసరం
● ఆహారపు అలవాట్లు, ఒత్తిడే ప్రధాన కారణం ● నేడు ‘వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే’
కోల్‌సిటీ(రామగుండం): స్ట్రోక్ అనగానే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు కూడా ఒకటి. దీన్నే పక్షవాతం అంటారు. బ్రెయిన్ స్ట్రోక్‌పై చాలా మందికి అవగాహన లేదు. కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకరపోయిన తర్వాతే ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. స్ట్రోక్ వచ్చిన వారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణభయం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆహారపు అలవాట్లు, మానసిక సమస్యల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోలుకోవడం కష్టం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది అక్టోబర్ 29న శ్రీప్రపంచ పక్షవాత(బ్రెయిన్ స్ట్రోక్) నివారణ దినోత్సవంశ్రీ నిర్వహిస్తోంది.
బ్రెయిన్ స్ట్రోక్ అంటే
స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు. దీన్నే పక్షవాతం అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ రెండు రూపాల్లో అటాక్ అవుతుంది. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాలు పాక్షికంగా, లేదా పూర్తిగా మూసుకుపోతాయి. దీంతో మెదడుకు రక్తం సరఫరా సక్రమంగా ఉండదు. మెదడుకు సరిపోయినంత రక్తం అందకపోవడంతో కణాలు చచ్చుబడిపోతాయి. చాలా తక్కువ మందికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన ఉందని వైద్యులంటున్నారు. శరీరంలో ఏదైనా భాగం నుంచి మెదడుకు ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేసే నరాలు బ్లాక్ అయినప్పుడు, ఆ భాగం పనిచేయకపోతే స్ట్రోక్ వస్తుంది. మద్యపానం వల్ల 26 శాతం మంది, హైపర్‌టెన్షన్ వల్ల మరో 26 శాతం, మధుమేహం వల్ల 16 శాతం పక్షవాతం భారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఏర్పడే లక్షణాలు..
మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం కారణంగా మెదడు పనితీరు క్షీణించి స్ట్రోక్ వస్తుంది. 85శాతం మందికి కాళ్లు, చేతులు, చచ్చుపడిపోవడం, కొందరికి మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. 15శాతం మందిలో మాత్రమే మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం అవుతుంది.
స్ట్రోక్‌కు శస్త్రచికిత్స...
అన్యూరిజం అనేది రక్తనాళాల్లో బలహీనమైన ప్రాంతం. ఇది బయటకు ఉబ్బుతుంది. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. అన్యూరిజం పగిలిపోయినట్లయితే మెదడు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ. దీనికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం. లక్షణాలను బట్టి సర్జికల్ క్లిప్పింగ్, ఎండోవాస్కులర్ థెరపి, కాయిలింగ్, ప్రో డైవర్టర్లు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి విధానాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.
దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వుస్థాయిలు (కొల్రెస్టాల్) పెరిగిపోవడం, గుండెజబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్‌కు దారి తీస్తాయి.


