నల్లాల లెక్క తేల్చుడే!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నల్లా కనెక్షన్‌ల లెక్క తేల్చేందుకు బల్దియా రంగంలోకి దిగింది. నల్లా అక్రమ కనెక్షన్‌లతో సంవత్సరాలుగా నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతుండడంతో సరిదిద్దేందుకు సర్వే చేపట్టింది. నగరవ్యాప్తంగా దాదాపు లక్షా ఐదు వేల ఇండ్లు ఉండగా, నల్లా కనెక్షన్లు మాత్రం కేవలం 51 వేలు మాత్రమే ఉన్నట్లు ఆన్‌లైన్‌లో లెక్కలున్నాయి. కనీసం 70 నుంచి 80 వేల నల్లా కనెక్షన్‌లు నగరంలో ఉండే అవకాశం ఉండడంతో, ఆ లెక్కలను తేల్చే పనిలో ప్రస్తుతం అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి రిజర్వాయర్‌ల వారీగా ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేపట్టారు.
రిజర్వాయర్‌ల వారీగా...
నల్లా కనెక్షన్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయి ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ఇంజినీరింగ్ అధికారులు సర్వే ప్రారంభించారు. నగరంలోని రిజర్వాయర్‌ల వారిగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది వివరాలు సేకరించారు. నగరంలో హైలెవెల్ పరిధిలో ఎస్‌ఆర్‌ఆర్, కోర్టు, మల్కాపూర్, రాంనగర్, అంబేడ్కర్‌నగర్ రిజర్వాయర్‌లు ఉండగా, లో లెవెల్ జోన్ పరిధిలో హౌసింగ్‌బోర్డుకాలనీ, మార్కెట్, భగత్‌నగర్, గౌతమినగర్, రాంపూర్ రిజర్వాయర్‌లు ఉన్నాయి. మొత్తం పది రిజర్వాయర్‌ల పరిధిలో ఈ సర్వేను చేపట్టారు. నల్లా వివరాలు సేకరించేందుకు ఒక ప్రొఫార్మా రూపొందించారు. సంబంధిత లైన్‌మెన్‌లు, ఫిట్టర్‌లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇంటింటికి తిరిగి ఆ ప్రొఫార్మా ప్రకారం వివరాలు సేకరిస్తుండగా, ఏఈ, డీఈ, ఈఈలు పర్యవేక్షిస్తున్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ స్వయంగా సర్వేను తనిఖీ చేశారు.
డొంక కదులుతోంది...
నగరంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో నల్లా కనెక్షన్‌లపై సర్వే చేపట్టడంతో అక్రమాల డొంక కదులుతోంది. కరీంనగర్ మున్సిపాల్టీగా ఉన్నప్పటి నుంచి ఈ నల్లా అక్రమ కనెక్షన్‌ల వ్యవహారం సాగుతోంది. కిందిస్థాయి సిబ్బంది, కొంతమంది అధికారుల సహకారంతో నల్లా అక్రమ కనెక్షన్‌ల వ్యవహారం యథేచ్చగా చోటుచేసుకొన్నాయి. ఇంటి యజమాని నుంచి డబ్బులు తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చినా రికార్డుల్లో చేర్చకపోవడం, ఆఫ్ ఇంచ్ ఉన్నట్లు కాగితాల్లో చూపించి వన్‌ఇంచ్ ఇవ్వడం, కమర్షియల్ కనెక్షన్‌లు ఇచ్చి, డొమాస్టిక్‌గా రాయడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీనితో నగరపాలకసంస్థకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రస్తుతం సర్వే చేపట్టడంతో ఈ అక్రమాల డొంక కదులుతోంది. మొదటి రోజే కనీసం 50 వరకు అక్రమ నల్లా కనెక్షన్‌లను గుర్తించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా గుర్తించిన అక్రమ నల్లా కనెక్షన్‌లను వారం రోజుల్లోగా రూ.2 వేలు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ఆ కనెక్షన్‌ను తొలగిస్తారు. కాగా వారంరోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనుకున్నా, కనీసం పదిహేను రోజులు కొనసాగే అవకాశం ఉంది. అలా అయితేనే నల్లాల లెక్కతేల్చాలనే బల్దియా లక్ష్యం నెరవేరుతుంది.


