లైంగిక వేధింపుల్లో విచారణ కొనసాగుతోంది | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల్లో విచారణ కొనసాగుతోంది

Oct 29 2025 7:31 AM | Updated on Oct 29 2025 7:31 AM

లైంగిక వేధింపుల్లో విచారణ కొనసాగుతోంది

లైంగిక వేధింపుల్లో విచారణ కొనసాగుతోంది

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్‌ భాషా అనే అటెండర్‌ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కలెక్టర్‌ పమేలా సత్పతి, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఐదు రోజుల నుంచే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియ్యలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్‌ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో హెచ్‌ఎంను కూడా సస్పెండ్‌ చేశారని తెలిపారు. హెచ్‌ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు.

సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాం

మోంథా తుపాను ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీంలను అలర్ట్‌చేశాం, అవసరమైతే అదనపు టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలోనూ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అటెండర్‌ అనుచిత ప్రవర్తనను ఖండించిన మహిళ కమిషన్‌

కరీంనగర్‌ టౌన్‌: గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్‌ చేసిన అనుచిత ప్రవర్తను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవంపట్ల నిర్లక్ష్యాన్ని, ఏ రూపంలోనూ సహించబోమని తెలిపారు. కలెక్టర్‌, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement