 
															అర్ధరాత్రి వాహనాల తనిఖీ
తిమ్మాపూర్: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖను అప్రమత్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి బైపాస్‌రోడ్డు, రాజీవ్ రహదారి మార్గాల్లో తనిఖీ చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహనపత్రాలు, ప్రయాణికుల జాబితా తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. రెండు ట్రాక్టర్లు, రెండు గూడ్స్ వాహనాలు అవసరమైన పత్రాలు లేకుండా నడిపిస్తున్నారని గుర్తించారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలకుపై జరిమానాలు విధించారు. అదేవిధంగా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణికుల వివరాలు సరిగా లేవని చర్యలు తీసుకున్నారు. మొత్తం ఐదు వాహనాలకు సుమారు రూ.70 వేల జరిమానా విధించారని తెలిపారు. ప్రజా రవాణా భద్రతకు ప్రాధాన్యమిస్తూ రాత్రివేళ తనిఖీలు కొనసాగుతాయని డీటీవో స్పష్టం చేశారు. డ్రైవర్లు, యజమానులు తప్పనిసరిగా అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని, అధిక లోడుతో ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. తనిఖీల్లో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరితయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదంతో అధికారుల అప్రమత్తం
నిబంధనలు పాటించనివారిపై రవాణాశాఖ చర్యలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
